HCA: మహిళా క్రికెటర్ల ఫిర్యాదు.. కోచ్ జైసింహపై హెచ్సీఏ వేటు
- టీమ్ తో కలిసి బస్సులో ప్రయాణిస్తూ మద్యం సేవించిన కోచ్
- వారించిన క్రికెటర్లపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ జైసింహ
- హెచ్ సీఏకు ఫిర్యాదు చేసిన మహిళా క్రికెటర్లు
మహిళా క్రికెటర్లతో అనుచితంగా ప్రవర్తించిన కోచ్ జైసింహపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ) వేటు వేసింది. కోచ్ బాధ్యతల నుంచి తప్పిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. క్రికెటర్ల గౌరవానికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, ఎవరైనా సరే ఉపేక్షించబోమని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..
మ్యాచ్ ఆడేందుకు విజయవాడ వెళ్లిన మహిళా క్రికెట్ జట్టు సభ్యులు.. మ్యాచ్ అనంతరం తిరిగి బస్సులో హైదరాబాద్ కు బయలుదేరారు. వాస్తవానికి వారంతా విమానంలో రావాల్సి ఉండగా కోచ్ జైసింహ ఆలస్యంగా రావడంతో విమానం అందుకోలేకపోయారు. దీంతో ఓ బస్సులో జట్టు సభ్యులు హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ క్రమంలో కోచ్ జైసింహ బస్సులోనే మద్యం తాగడం మొదలుపెట్టాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆటగాళ్లపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. అదే బస్సులో సెలక్షన్ కమిటీ సభ్యుడు పూర్ణిమారావు కూడా ఉన్నారు. కోచ్ ప్రవర్తనను అడ్డుకోవాల్సిన పూర్ణిమారావు అలా చేయకపోగా జైసింహను ఎంకరేజ్ చేసినట్లు ఆటగాళ్లు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట జరిగిన ఈ ఘటనపై మహిళా క్రికెటర్లు హెచ్ సీఏకు ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్ సీఏ ప్రెసిడెంట్ శుక్రవారం కోచ్ జైసింహపై చర్యలు తీసుకున్నారు. ఆయనను కోచ్ బాధ్యతల నుంచి తప్పించారు. మహిళా క్రికెటర్ల ఫిర్యాదుపై విచారణ జరిపిస్తున్నామని మీడియాకు వెల్లడించారు.