Team India: మూడో టెస్టు: తొలి ఇన్నింగ్స్ లో భారీ స్కోరు సాధించిన టీమిండియా

Team India all out for 445 runs in first innings of Rajkot test
  • రాజ్ కోట్ లో టీమిండియా-ఇంగ్లండ్ టెస్టు
  • ఆటకు నేడు రెండో రోజు
  • తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు టీమిండియా ఆలౌట్
  • బ్యాట్ తో రాణించిన ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్
ఇంగ్లండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. రాజ్ కోట్ లో ఇవాళ రెండో రోజు ఆట కొనసాగించిన టీమిండియా లంచ్ తర్వాత తొలి ఇన్నింగ్స్ ను ముగించింది. 

ఉదయం సెషన్ లో రవీంద్ర జడేజా (112) వికెట్ కోల్పోయిన టీమిండియాకు కొత్త వికెట్ కీపర్ ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్ జోడీ విలువైన భాగస్వామ్యం అందించింది. కెరీర్ లో తొలి టెస్టు ఆడుతున్న జురెల్ 2 ఫోర్లు, 3 సిక్సులతో 46 పరుగులు చేయగా... అశ్విన్ 6 ఫోర్లతో 37 పరుగులు చేశాడు. బుమ్రా సైతం బ్యాట్ ఝళిపిస్తూ 28 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ తో 26 పరుగులు సాధించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ ఉడ్ 4, రెహాన్ అహ్మద్ 2, జేమ్స్ ఆండర్సన్ 1, టామ్ హార్ట్ లే 1, జో రూట్ 1 వికెట్ తీశారు. 

అనంతరం, తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 48 పరుగులు చేసింది. ఓపెనర్లు బెన్ డకెట్ 36, జాక్ క్రాలీ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

నిన్న తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (131), రవీంద్ర జడేజా సెంచరీలు సాధించడం తెలిసిందే. అరంగేట్రం బ్యాట్స్ మన్ సర్ఫరాజ్ ఖాన్ 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
Team India
1st Innings
England
Third Test
Rajkot

More Telugu News