Paytm Payment Bank: ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్ తొలగింపు
- ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ నిర్ణయం
- పేటీఎం పేమెంట్ బ్యాంక్ లేని ఫాస్టాగ్‌లు కొనాలని వినియోగదారులకు సూచన
- 20 మిలియన్ల మందిపై ప్రభావం.. కొత్త ఆర్ఎఫ్‌డీఐ స్టిక్కర్లు మార్చుకోవాల్సిన పరిస్థితి
పేటీఎంపై కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కఠిన ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ కీలక చర్యకు ఉపక్రమించింది. టోల్‌గేట్ల వద్ద చెల్లింపులకు ఉపయోగించే ఫాస్టాగ్‌ల నుంచి పేటీఎం పేమెంట్ బ్యాంక్‌ను తొలగించింది. ఫాస్టాగ్‌ల కొనుగోలుకు సూచించిన 32 అధికారిక బ్యాంకుల జాబితా నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను తప్పించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌ను మినహాయించి ఇతర ఆథరైజ్డ్ బ్యాంకులతో అనుసంధానించిన ఫాస్టాగ్‌లను కొనుగోలు చేయాలని వినియోగదారులకు సూచించింది. ఈ నిర్ణయం దాదాపు 20 మిలియన్ల మంది పేటీఎం ఫాస్టాగ్ వినియోగదారులపై ప్రభావం చూపనుంది. వీరంతా కొత్త ఆర్‌ఎఫ్‌ఐడీ (Radio-frequency identification) స్టిక్కర్లను తీసుకోవాల్సి ఉంటుంది.
కాగా ఫాస్టాగ్‌ల ఆథరైజ్డ్ బ్యాంకుల జాబితాలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐతో పాటు ఇతర అనేక బ్యాంకులు, పేమెంట్ కంపెనీలు ఉన్నాయి. ఫాస్టాగ్‌ల అధికారిక బ్యాంకుల జాబితా నుంచి పేటీఎంను తొలగించడంతో ఆ సంస్థ పెద్ద సంఖ్యలో కస్టమర్లను కోల్పోనుంది. మార్కెట్‌లో పోటీ నెలకొన్న నేపథ్యంలో యూజర్లను చేజార్చుకోనుంది. ఆంక్షలు తొలగిపోయాక మళ్లీ రెగ్యులేటరీ సంస్థల ఆమోదం పొంది ఈ స్థాయిలో కస్టమర్లను పొందడమంటే చాలా కష్టమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆర్బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎం మార్కెట్ విలువ అంతకంతకూ క్షీణిస్తోంది. గత 11 రోజుల వ్యవధిలో కంపెనీ షేర్లు ఏకంగా 57 శాతం మేర పతనమయ్యాయి. అంటే సుమారు రూ.27 వేల కోట్లు నష్టపోయినట్టయ్యింది.