Duvvada Srinivas: అచ్చెన్నాయుడిని లోపల వేయించి, టీడీపీ క్యాడర్‌ను భయపెట్టడం వల్లే ఆ ఎన్నికల్లో గెలిచాం.. వైరల్ అవుతున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ వ్యాఖ్యల వీడియో

YSRCP MLC Duvvada Srinivas Sensational Comments Viral On Social Media
  • స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అనుచరుల వద్ద దువ్వాడ చేసిన వ్యాఖ్యల వీడియో వెలుగులోకి
  • అచ్చెన్నాయుడు కొట్టాడని ఆరోపించి ఆయనను లోపల వేయించానన్న దువ్వాడ
  • సంతబొమ్మాలి జడ్పీటీ అభ్యర్థి పుక్కళ్ల శ్రీనివాస్‌పై రౌడీషీట్ తెరిపించానన్న వైసీపీ నేత
  • భయపెట్టడం, రౌడీయిజం చేయడం వల్లే ఆ ఎన్నికల్లో 119 సర్పంచ్ స్థానాలు గెలిచామన్న దువ్వాడ
తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిని లోపలేయడం, ఆ పార్టీ క్యాడర్‌ను భయపెట్టడం లాంటి రౌడీయిజం చేయడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించగలిగామంటూ వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అనుచరుల వద్ద ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్ర చర్చనీయాంశమవుతున్నాయి.

ఆ వీడియోలో ఆయన మాటలు యథాతథంగా.. టెక్కలి నియోజకవర్గంలోని 55 సర్పంచ్ స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు గెలుస్తారని, మిగిలినవన్నీ టీడీపీ గెలుస్తుందని చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలా? అని ఆలోచించాం. నిమ్మాడలో మాకు మద్దతు ఇచ్చే కింజరాపు అప్పన్నను సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా టీడీపీ వారు ఇబ్బంది పెట్టారు. అప్పుడు నేను ఆ ఊరిపై దాడిచేసి ఆయనతో నామినేషన్ వేయించా. అచ్చెన్నాయుడు నన్ను కొట్టారని ఆరోపించి ఆయనను జైలులో పెట్టించా.

సంతబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పుక్కళ్ల శ్రీనివాస్‌ను హెచ్చరించి ఆయనపై రౌడీషీట్ తెరిపించి అరెస్ట్ చేయించాం. కోటబొమ్మాళి జడ్పీటీసీ అభ్యర్థి పూజారి శైలజ భర్త సత్యాన్ని ఇంట్లోనే బంధించాం. టెక్కలి, నందిగామ జడ్పీటీసీ అభ్యర్థులను బయటకు రాకుండా చేశాం. ఇవన్నీ చేస్తే నాలుగు ఎంపీపీ, నాలుగు జడ్పీటీసీ, 136 పంచాయతీల్లో 119 పంచాయతీల్లో విజయం సాధించాం. అచ్చెన్నాయుడిని లోపలేయడం, ఆ పార్టీ క్యాడర్‌ను భయపెట్టడం వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో  గెలవగలిగాం.. అని దువ్వాడ ఆ వీడియోలో చెప్పడం స్పష్టంగా వినిపిస్తోంది.




Duvvada Srinivas
YSRCP
Atchannaidu
TDP
Srikakulam District

More Telugu News