Guntur Kaaram: గుంటూరు కారం సినిమా మహేశ్‌బాబు స్థాయి సినిమా కాదు.. మూవీపై పరుచూరి రివ్యూ

Paruchuri Gopala Krishna Review On Guntur Kaaram

  • 2021లో మొదలుపెట్టిన సినిమా 2024లో విడుదలైందన్న పరుచూరి
  • ఈ గ్యాప్‌లో ఏదో జరిగి ఉంటుందని అభిప్రాయపడిన గోపాలకృష్ణ
  • సినిమా కథనం గందరగోళంగా అనిపించిందని వ్యాఖ్య
  • గుంటూరు అబ్బాయి అని టైటిల్ పెట్టి ఉంటే కనీసం కుటుంబ కథా చిత్రమని అనుకునేవారన్న గోపాలకృష్ణ
  • త్రివిక్రమ్ మరో మంచి సినిమాతో వస్తాడని ఆశిస్తున్నానన్న పరుచూరి

గుంటూరు కారం సినిమా మహేశ్‌బాబు స్థాయి సినిమా కాదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ పేర్కొన్నారు. రిలీజ్ అయిన సినిమాలపై తన యూట్యూబ్ చానల్‌లో విశ్లేషణ చేస్తూ ఆకట్టుకునే ఆయన తాజాగా గుంటూరుకారం సినిమాపై రివ్యూ ఇచ్చారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఎవరినీ విమర్శించాలని కాదు కానీ, ఆ సినిమా మహేశ్‌బాబు స్థాయి సినిమా కాదని తేల్చిచెప్పారు. 350కిపైగా సినిమాలకు పనిచేసిన తనకు గుంటూరుకారం సినిమా కథనం కాస్తంత గందరగోళంగా అనిపించిందని పేర్కొన్నారు. ప్రేక్షకులు ఎలా అర్థం చేసుకున్నారో తనకు తెలియదని అన్నారు. అయితే, రెండోసారి చూస్తే కొంత స్పష్టత వస్తుందేమోనని అభిప్రాయపడ్డారు. 

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్‌ప్లేతో ఆడుకున్నారని, రూ. 200 కోట్లతో సినిమా తీసినప్పుడు కనీసం రూ. 300 కోట్లు అయినా వస్తే తప్ప లాభం ఉండదని ఇండస్ట్రీలో చెబుతుంటారని పేర్కొన్నారు. 2021లో మొదలుపెట్టిన ఈ సినిమా 2024లో విడుదలైందని, ఈ గ్యాప్‌లో కథలోనో, కథనంలోనో చిత్రబృందం మధ్య తేడాలు వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. త్రివిక్రమ్ మంచి టైటిల్స్ పెడతాడని, ఆయన సినిమాలన్నింటిలోకీ ఇది కొంచెం తేడాగా అనిపించిందని పరుచూరి పేర్కొన్నారు.

సంబంధిత డాక్యుమెంట్స్‌పై హీరో సంతకం పెడతాడా? లేదా? అనే పాయింట్‌కు కంపోజ్‌డ్ సీన్స్ రాసుకున్నారని, శారద-బాలకృష్ణ, వాణిశ్రీ-చిరంజీవి కాంబినేషన్‌లానే రమ్యకృష్ణ-మహేశ్‌బాబు కాంబో ఉంటుందని ఊహించుకున్నానని, కానీ ఇది తల్లీకొడుకుల కథ అని పేర్కొన్నారు. అమ్మను దైవంలా కొలుస్తాడు తప్పితే టీజ్ చేయలేదని, ఇబ్బంది పెట్టలేదని, ఈ సినిమా విషయంలో జరిగిన పొరపాటు ఇదేనని వివరించారు. అద్భుతంగా కథలు రాసే త్రివిక్రమ్ ఇది సరిపోతుందని అనుకున్నారేమోనని గోపాలకృష్ణ పేర్కొన్నారు.

సెంటిమెంట్ ప్రధానంగా సినిమాని తీద్దామని భావిస్తే కనుక ఈ టైటిల్ తప్పు అని, గుంటూరు అబ్బాయి అని పెట్టి ఉంటే కుటుంబ కథా చిత్రం చూడబోతున్నామని ప్రేక్షకులు అనుకుని ఉండేవారని అన్నారు. గుంటూరు కారం పేరుకు సరిపోయేలా స్క్రీన్‌ప్లే సెట్ చేశారని, సంతకం పెట్టించేందుకు హీరో ఇంటికి వచ్చి హీరోయిన్ ప్రేమలో పడేయాలని అనుకుంటుందని, ఇది పాజిటివ్ దృక్పథం కాదన్నారు. రమ్యకృష్ణ కుటుంబానికి సంబంధించిన ఎమోషన్స్‌నే డెవలప్‌ చేసుకుంటూ వెళ్లి ఉంటే సినిమా మరోలా ఉండేదని విశ్లేషించారు. ఏదైనా క్యారెక్టర్‌‌లో రియలైజేషన్ వచ్చి ఉంటే ప్రేక్షకుల హృదయానికి టచ్ అయ్యేదన్నారు. త్రివిక్రమ్, మహేశ్ సినిమా కాబట్టి డబ్బులు వస్తాయని, కానీ డబ్బులు రావడం వేరు, సంతృప్తి వేరని అన్నారు. త్రివిక్రమ్ అంటే తనకు అభిమానమని, మరో మంచి కథతో వస్తారని ఆశిస్తున్నట్టు గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News