Harish Rao: నన్ను టీవీలో చూపించరా? మా ముఖాలు కూడా చూపించరా?: అసెంబ్లీలో హరీశ్ రావు

Interesting comments by harish rao in Telangana assembly

  • నీటి పారుదల రంగంపై అసెంబ్లీలో శ్వేతపత్రం సందర్భంగా చర్చ
  • తమను చూపించడం లేదని ఇంటి నుంచి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారన్న హరీశ్ రావు
  • అలాంటిదేమీ లేదని... అందర్నీ చూపిస్తామన్న స్పీకర్ ప్రసాద్ కుమార్

తెలంగాణ అసెంబ్లీలో శనివారం ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. నీటి పారుదల రంగంపై తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. ఈ అంశంపై చర్చ సందర్భంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనను అసెంబ్లీ టీవీలో చూపించరా? అని ప్రశ్నించారు. తన ఇంటి నుంచి ఫోన్ చేసి మరీ అడుగుతున్నారని వ్యాఖ్యానించారు. నన్ను తప్ప అందర్నీ చూపిస్తున్నారన్నారు. మా ముఖాలు కూడా చూపించకుండా ఇంత అన్యాయమా? అని మండిపడ్డారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ స్పందించారు. అలాంటిదేమీ లేదని... అందర్నీ చూపిస్తామని స్పష్టం చేశారు. 

శ్వేతపత్రంలో అన్నీ తప్పులే

ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధాలు చెప్పారని హరీశ్ రావు మండిపడ్డారు. శ్వేతపత్రంలోని తప్పుల తడకలను చదివి ప్రజలకు వినిపిస్తామన్నారు. గత ప్రభుత్వంపై పదే పదే అబద్ధాలు చెప్పడం ద్వారా అవే నిజమని ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదిలా ఉండగా, మధ్యాహ్నం మంత్రి శ్రీధర్ బాబుతో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు భేటీ అయ్యారు.

  • Loading...

More Telugu News