Ravichandran Ashwin: అశ్విన్‌ని స్పిన్ బౌలింగ్ చేయమని సలహా ఇచ్చిందో ఎవరో చెప్పిన అతడి తండ్రి
- తల్లి చిత్ర సలహా ఇచ్చారని వెల్లడించిన అశ్విన్ తండ్రి రవిచంద్రన్
- శ్వాస సమస్య, మోకాలి ఇబ్బంది కారణంగా ఫాస్ట్ బౌలింగ్ కాదని.. స్పిన్ సలహా ఇచ్చారని ప్రస్తావన
- అశ్విన్ కెరియర్‌లో ఇదే పెద్ద టర్నింగ్ పాయింట్ అని వ్యాఖ్య
భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ టెస్ట్ మ్యాచ్‌లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భారత్ తరపున 500 టెస్టు వికెట్లు తీసిన రెండవ భారతీయ బౌలర్‌గా నిలిచాడు. చారిత్రాత్మకమైన ఈ మైలురాయిని సాధించిన అశ్విన్‌ను ఫాస్ట్ బౌలింగ్ మానుకొని స్పిన్ బౌలింగ్ చేయమంటూ అతడి తల్లి గీత సలహా ఇచ్చారట. ఈ విషయాన్ని అశ్విన్ తండ్రి రవిచంద్రన్ వెల్లడించాడు. అశ్విన్ 500 వికెట్ల క్లబ్‌లో చేరిన సందర్భంగా ఆసక్తికరమైన ఈ విషయాన్ని ఆయన పంచుకున్నారు. స్పిన్ బౌలింగ్ చేయాలని మొదట సూచించింది తల్లి చిత్ర అని, అశ్విన్ కెరియర్‌కు ఇదే పెద్ద ‘టర్నింగ్ పాయింట’ అని వ్యాఖ్యానించారు.
‘‘అశ్విన్ ఆఫ్ స్పిన్ బౌలింగ్‌కు మారడం అతడు క్రికెట్ కెరియర్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్. సలహా ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్న నా భార్య చిత్రకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆ రోజుల్లో అశ్విన్‌కి శ్వాస సంబంధ సమస్య వచ్చింది. మోకాలి సమస్య కూడా ఉంది. అంతగా పరిగెత్తడం సాధ్యపడలేదు. దీంతో నువ్వు ఎందుకు అంతగా పరిగెత్తాలి. కొన్ని అడుగులు వేసి స్పిన్ బౌలింగ్ చేయి’’ అని చిత్ర సలహా ఇచ్చారని రవిచంద్రన్ గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు రాసిన కాలమ్‌లో ఆయన పేర్కొన్నారు. కాగా అశ్విన్ ఆరంభంలో మీడియం పేసర్‌గా ప్రయత్నించిన విషయం తెలిసిందే.
కాగా అందరూ భావిస్తున్నట్టుగా 500వ టెస్టు వికెట్‌ను అశ్విన్ అంతగా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టు తనకు అనిపించలేదని రవిచంద్రన్ అన్నారు. అశ్విన్‌తో తాను మాట్లాడానని, 500 వికెట్లు తీసిన భావనలో ఉన్నట్టుగా అనిపించలేదని పేర్కొన్నారు. కాగా టెస్టుల్లో 500 వికెట్లు తీసిన రెండవ భారతీయ బౌలర్‌గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. ఇంగ్లండ్‌పై క్రాలే వికెట్‌తో 500వ వికెట్‌ను పూర్తి చేసుకున్నాడు. కెరియర్‌లో చారిత్రాత్మకమైన ఈ మైలురాయిని తన తండ్రి రవిచందన్‌కి అంకితం ఇస్తున్నానని ప్రకటించిన విషయం తెలిసిందే.