Janasena: గుంటూరు కోర్టులో జనసేనాని పవన్‌ కల్యాణ్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

A criminal case has been registered against Janasena party chief Pawan Kalyan in Guntur court

  • మార్చి 25న హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసిన న్యాయస్థానం
  • గతేడాది జులై 9న వారాహి యాత్రలో రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించిన పవన్
  • వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఒంటరి మహిళలను గుర్తించి అపహరిస్తున్నారన్న జనసేనాని
  • రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్న ఏపీ సర్కారు

వాలంటీర్లకు వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలతో  గుంటూరు న్యాయస్థానంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై క్రిమినల్‌ కేసు నమోదయింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. 499, 500, ఐపీసీ సెక్షన్ల కింద పవన్‌పై క్రిమినల్‌ కేసు నమోదు చేసింది. కేసు విచారణను నాలుగవ అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ జిల్లా ప్రధాన కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా ఈ కేసులో పవన్‌ కల్యాణ్‌ మార్చి 25న విచారణకు హాజరు కావాలంటూ నాలుగవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి శరత్‌బాబు నోటీసులు జారీ చేశారు.

గతేడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం ఈ కేసు పెట్టింది. వాలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు పత్రికలు, ప్రసార మాధ్యమాల్లో ప్రసారమయ్యాయని ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. పవన్ వ్యాఖ్యలు వాలంటీర్ల మనోధైర్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రభుత్వంపైనా బురదజల్లేలా ఉన్నాయని ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. పవన్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరింది. తాడికొండ మండలం కంతేరుకు చెందిన వాలంటీర్ బి.పవన్‌ కుమార్‌తో పాటు కొందరు వాలంటీర్లు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పవన్‌పై కేసు దాఖలు చేస్తున్నట్లు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా పవన్‌ కల్యాణ్‌పై చర్యలు చేపట్టేందుకు గతేడాది జులై 20న రాష్ట్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 

కాగా గతేడాది జులై 9న ఏలూరులో వారాహి యాత్రలో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరి సమాచారం సేకరిస్తున్నారని, ఒంటరి మహిళలను కనిపెట్టి కొందరు సంఘ విద్రోహశక్తుల ద్వారా వల పన్ని కిడ్నాప్ చేస్తున్నారని పవన్‌ ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొంతమంది వైసీపీ పెద్దల పాత్ర ఉందని కేంద్ర నిఘా వర్గాలు తనకు చెప్పాయని పవన్‌ పేర్కొన్నారు. ఇక కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో సుమారు 29 వేల నుంచి 30 వేల మంది అమ్మాయిలు కనిపించకుండా పోయారని ఆరోపించారు. అదృశ్యమైన వారిలో 14 వేల మంది తిరిగి వచ్చారని పోలీసులు చెబుతున్నారని, మిగిలినవారి గురించి సీఎం ఎందుకు ప్రశ్నించడం లేదని, డీజీపీ కనీసం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించిన విషయం తెలిసిందే.


  • Loading...

More Telugu News