Tip: వెయిట్రస్ ను సర్ ప్రైజ్ చేసిన కస్టమర్.. షాకిచ్చిన రెస్టారెంట్..!
- అమెరికాలో వెయిట్రస్ కు రూ.30 లక్షల భారీ టిప్
- సహోద్యోగులతో పంచుకున్న రెస్టారెంట్ ఉద్యోగి
- వారం తర్వాత ఉద్యోగంలో నుంచి తీసేసిన యాజమాన్యం
భారీ మొత్తం టిప్ ఇచ్చి వెయిట్రస్ ను ఓ కస్టమర్ సర్ ప్రైజ్ చేయగా.. వారం తర్వాత ఉద్యోగం నుంచి తొలగించి యాజమన్యం ఆమెకు షాకిచ్చింది. అమెరికాలో మిషిగాన్ రాష్ట్రంలోని ఓ రెస్టారెంట్ వెయిట్రస్ కు ఈ అనుభవం ఎదురైంది. తొలగింపునకు ఆ టిప్ కు సంబంధంలేదని స్పష్టంచేసినా.. ఎందుకు తొలగించాల్సి వచ్చిందనే కారణం మాత్రం రెస్టారెంట్ యాజమాన్యం వెల్లడించలేదు. అసలు ఏం జరిగిందంటే..
బెంటన్ హార్బర్ లోని ‘మాసన్ జార్ కేఫ్’ లో ఓ కస్టమర్ 32.43 డాలర్ల బిల్ చేశాడు. ఆ బిల్ తెచ్చిన వెయిట్రస్ కు ఏకంగా 10 వేల డాలర్ల టిప్ ఇచ్చాడు. మన రూపాయల్లో చెప్పాలంటే.. సుమారు 2,700 బిల్లు అయితే సుమారుగా 8.30 లక్షల రూపాయలు టిప్ గా ఇచ్చాడు. బిల్ పేపర్ పై ఎమౌంట్ రాసి కార్డు చేతికిచ్చాడు. టిప్ ఎమౌంట్ భారీగా ఉండడంతో ఏమరపాటులో రాశారేమోనని రెస్టారెంట్ మేనేజర్ స్వయంగా వెళ్లి కస్టమర్ తో మాట్లాడాడు. అయితే, తాను కరెక్ట్ గానే వేశానని, రెస్టారెంట్ లోని వెయిటర్లంతా సమానంగా పంచుకోవాలని సూచించాడు.
దీంతో రెస్టారెంట్ సిబ్బంది సంతోషంతో గంతులు వేశారు. ఆ టిప్ అందుకున్న వెయిట్రస్ సంతోషం అంతా ఇంతా కాదు. అయితే, ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. వారం రోజుల తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు చెప్పి రెస్టారెంట్ యాజమాన్యం ఆమెకు షాకిచ్చింది. ఇదేంటని అడిగినా సరైన కారణం చెప్పలేదని వెయిట్రస్ వాపోయింది. పదిహేనేళ్ల వయసు నుంచి తాను వివిధ ఉద్యోగాలు చేశానని, ఇన్నేళ్లలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి (ఉద్యోగం లేకుండా) ఎదుర్కోలేదని చెప్పింది.
ఈ విషయంపై సదరు రెస్టారెంట్ యాజమాన్యాన్ని మీడియా సంప్రదించగా.. వెయిట్రస్ ను తొలగించడానికి, ఆమె అందుకున్న భారీ టిప్ కు సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఆమెను తొలగించడం పూర్తిగా బిజినెస్ పరమైన నిర్ణయమని చెప్పింది. అయితే, ఆ కారణం ఏంటనేది చెప్పడానికి యాజమాన్యం నిరాకరించింది. ఉద్యోగులను తాము చాలా బాగా చూసుకుంటామని, తమ సిబ్బందిలో చాలామంది ఐదారేళ్లుగా పనిచేస్తున్నవారేనని వివరించింది.