Revanth Reddy: 30 ఏళ్లుగా రాజకీయాలు ఎలా ఉన్నా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదు: రేవంత్ రెడ్డి
- నానక్ రామ్ గూడలో రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవన ప్రారంభోత్సవం
- హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
- హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని వెల్లడి
హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో నూతనంగా నిర్మించిన తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్ విభాగం ప్రధాన భవనాన్ని సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత మూడు దశాబ్దాలుగా రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ, హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరం ప్రపంచంతో పోటీ పడుతోందని అన్నారు. హైదరాబాద్ పెట్టుబడులకు ఎంతో అనువైన ప్రాంతం అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఇకపై హైదరాబాద్ నగరాన్ని అర్బన్, సెమీ అర్బన్, రూరల్ పేరిట మూడు భాగాలుగా విభజన చేసి, అభివృద్ధి పరంగా మరింత ముందుకు తీసుకెళతామని చెప్పారు. ఫార్మా సిటీలు కాదు... ఇకపై ఫార్మా విలేజ్ లు వస్తాయి అని రేవంత్ స్పష్టం చేశారు.
ఓఆర్ఆర్ కు చేరువలో పాతిక వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక వినూత్న సిటీని ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు.
తమ ప్రభుత్వానిది విజన్-2050 అని పేర్కొన్నారు. తెలంగాణను సర్వతోముఖాభివృద్ధి దిశగా నడిపించేందుకు మాస్టర్ ప్లాన్ కు రూపకల్పన చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.