WTC points table: రాజ్‌కోట్‌ టెస్టులో భారత్ చారిత్రాత్మక విజయంతో మారిపోయిన డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టిక

WTC points table have been changed by Indias historic win in Rajkot Test against England
  • రెండవ స్థానానికి ఎగబాకిన టీమిండియా
  • మూడవ ర్యాంకుకు పడిపోయిన ఆస్ట్రేలియా
  • డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్న న్యూజిలాండ్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన మూడవ టెస్టులో టీమిండియా చారిత్రాత్మకమైన విజయం సాధించింది. ఏకంగా 434 పరుగుల తేడాతో గెలిచి నయా చరిత్ర లిఖించింది. భారత్ ఇప్పటివరకు మొత్తం 577 టెస్టులు ఆడగా పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయంగా ఉంది. అంతకుముందు 2021లో న్యూజిలాండ్‌పై 372 పరుగుల తేడాతో గెలుపు రికార్డుని తాజా మ్యాచ్ బద్దలు కొట్టింది. దీంతో సిరీస్‌లో 2-1తో టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఫలితంగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టిక మారిపోయింది. ఆస్ట్రేలియాను అధిగమించి భారత్ రెండవ స్థానానికి దూసుకెళ్లింది.

ప్రస్తుతం 75 శాతం పాయింట్లతో న్యూజిలాండ్ అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత 59.52 శాతం పాయింట్లతో భారత్ రెండవ స్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా 55% పాయింట్లతో మూడవ స్థానానికి దిగజారింది. ఆ తర్వాత బంగ్లాదేశ్ ( 50 పాయింట్లు), పాకిస్థాన్ (36.66 పాయింట్లు), వెస్టిండీస్ (33.33 పాయింట్లు), దక్షిణాఫ్రికా (25 పాయింట్లు), ఇంగ్లండ్ (21.88 పాయింట్లు) వరుస స్థానాల్లో నిలిచాయి.

కాగా రాజ్‌కోట్ టెస్టు రెండవ ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ అజేయ డబుల్ సెంచరీ, రవీంద్ర జడేజా 5 వికెట్లతో రాణించడంతో టీమిండియా చారిత్రాత్మకమైన విజయాన్ని నమోదు చేసింది. 557 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయింది. కాగా రాంచీ వేదికగా వచ్చే శుక్రవారం నుంచి నాలుగవ టెస్ట్ మ్యాచ్ జరగనుంది. కాగా హైదరాబాద్ టెస్టులో ఇంగ్లండ్, వైజాగ్ టెస్టులో భారత్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
WTC points table
India vs England
Cricket
Team India

More Telugu News