G. Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలే... ప్రజలను ఎలా దోచుకున్నాయో చెబుతాం: కిషన్ రెడ్డి
- జయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించిన కిషన్ రెడ్డి
- ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలు
- సమ్మక్క సారక్క పండుగ సందర్భంగా కాకతీయ భద్రాద్రి యాత్ర ఆలస్యం
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ అవినీతి పార్టీలేనని... ఆ పార్టీలు ప్రజలను ఎలా దోచుకున్నాయో ప్రజలకు బీజేపీ విజయ సంకల్ప యాత్రలో వివరిస్తామని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జనసందేశ్ డిజిటల్ ఎడిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయ సంకల్ప యాత్ర పాటలు, గోడ పత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ... బీజేపీ విజయ సంకల్ప యాత్రలను ఫిబ్రవరి 20 నుంచి మార్చి 2 వరకు నిర్వహిస్తామన్నారు. ఈ యాత్రను ఐదు క్లస్టర్స్లలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఐదు క్లస్టర్స్‌కు ఐదు పేర్లు పెట్టారు. కొమురంభీమ్, రాజరాజేశ్వరి, భాగ్యలక్ష్మి, కాకతీయ భద్రాద్రి, కృష్ణమ్మ యాత్రలను ఐదు చోట్ల నిర్వహిస్తామన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి లోక్ సభ నియోజకవర్గాలలో జరిగే కొమురంభీమ్ యాత్ర భైంసాలోని సరస్వతీ ఆలయంలో పూజలు నిర్వహించి ప్రారంభిస్తామన్నారు. ఈ యాత్రను అసోం సీఎం హింతబిశ్వ శర్మ ప్రారంభిస్తారన్నారు.
కరీంనగర్, జహీరాబాద్, చేవెళ్ల, మెదక్‌లలో నిర్వహించే రాజరాజేశ్వరి యాత్రను తాండూరులో ప్రారంభిస్తామన్నారు.
సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి, భువనగిరి లోక్ సభ నియోజకవర్గాలలో జరిగే భాగ్యలక్ష్మి యాత్రను గోవా సీఎం ప్రమోద్ సావంత్ భువనగిరిలో ప్రారంభించనున్నట్లు చెప్పారు. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం లోక్ సభ నియోజకవర్గాల్లో జరిగే కాకతీయ భద్రాద్రి యాత్ర సమ్మక్క సారక్క జాతర కారణంగా ఆలస్యంగా ప్రారంభమవుతుందని తెలిపారు.
మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ పార్లమెంట్ పరిధిలో నిర్వహించే కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర మక్తల్‌లోని కృష్ణ గ్రామం నుంచి ప్రారంభమవుతుందని వెల్లడించారు. దీనిని కేంద్రమంత్రి పురుషోత్తం రూపాలా ప్రారంభిస్తారని తెలిపారు.