Kollu Ravindra: సజ్జలకు కొల్లు రవీంద్ర కౌంటర్
- జగన్ ఏం అబద్ధాలు చెప్పారో చెప్పాలన్న సజ్జల
- 99 శాతం హామీలు అమలు చేశామని జగన్ అబద్ధాలు చెపుతున్నారన్న కొల్లు రవీంద్ర
- మద్య నిషేధం చేయకుండా ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్న
ముఖ్యమంత్రి జగన్ తన ప్రసంగాల్లో అన్నీ అబద్ధాలే చెపుతున్నారని విపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ ముఖ్యమంత్రి ఏం అబద్ధాలు చెప్పారో చెప్పాలని ప్రశ్నించారు. సజ్జల వ్యాఖ్యలపై టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర స్పందిస్తూ... జగన్ చెప్పేవన్నీ నిజాలైతే బహిరంగ చర్చకు ఎందుకు వెనకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు. హామీల్లో 99 శాతం అమలు చేశామని జగన్ పచ్చి అబద్ధాలు చెపుతున్నారని విమర్శించారు.
వెబ్ సైట్ నుంచి టీడీపీ మేనిఫెస్టోను తొలగించారంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్న జగన్... ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేశారని దుయ్యబట్టారు. అంగన్ వాడీలకు తెలంగాణ కంటే రూ. 1,000 ఎక్కువగా ఇస్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పారని, అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని చెప్పారని, ఇద్దరు బిడ్డలకు అమ్మఒడి ఇస్తామని చెప్పారని... అన్ని విషయాల్లో మాట తప్పారని అన్నారు. ఈ అంశాలపై బహిరంగ చర్చకు రావాలని చంద్రబాబు సవాల్ విసిరారని చెప్పారు.