AP High Court: టెట్, డీఎస్సీ పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ
- ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
- టెట్ నిర్వహణకు కూడా కసరత్తులు
- తగినంత సమయం ఇవ్వకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారంటూ పిటిషన్లు
- అంత హడావిడిగా ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కోర్టు
ఏపీ ప్రభుత్వం ఇటీవల డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో టెట్ నిర్వహణకు కూడా సిద్ధమవుతోంది. అయితే, తగినంత సమయం ఇవ్వకుండా టెట్, డీఎస్సీ పరీక్షలు నిర్వహించడంపై ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
ఈ పిటిషన్లపై హైకోర్టు నేడు విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు ఆదినారాయణరావు, శరత్ చంద్ర వాదనలు వినిపించారు. హాల్ టికెట్ల డౌన్ లోడ్ లోనూ అసంబద్ధ విధానాలు ఉన్నాయని పిటిషనర్లు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. పరీక్ష ప్రక్రియను ఐదు వారాల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
వాదనలు విన్న ఏపీ హైకోర్టు... 2022లో రెండు నెలల సమయం ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం ఇవ్వాలి కదా అని వ్యాఖ్యానించింది.
అందుకు ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ... ఈ విషయంలో ప్రభుత్వం నుంచి తగిన ఆదేశాలు తీసుకుంటామని కోర్టుకు తెలిపారు. అనంతరం కేసు విచారణను ఏపీ హైకోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.