NRI jailed for Life: 30 ఏళ్ల క్రితం లండన్‌లో వేశ్య హత్య.. తాజాగా భారత సంతతి వ్యక్తికి జీవిత ఖైదు
- 140 సార్లు పొడిచి హత్య చేసినట్టు నిర్ధారణ
- మృతురాలి ఉంగరానికి చుట్టుకుని ఉన్న వెంట్రుకతో వీడిన మిస్టరీ
- తాజాగా అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతికతతో ఫోరెన్సిక్ పరీక్షలు
- వెంట్రుక నిందితుడిదని తేలడంతో జీవితఖైదు ఖరారు
ముఫ్ఫై ఏళ్ల క్రితం లండన్‌లో వేశ్యను హత్య చేసిన కేసులో ఓ భారత సంతతి వ్యక్తికి తాజాగా జీవిత ఖైదు పడింది. ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఆధునిక ఫోరెన్సిక్ సాంకేతికతతో సందీప్ పటేల్ ఈ హత్య చేసినట్టు రుజువైంది. 1994లో లండన్‌లోని వెస్ట్‌మిన్‌స్టర్ ప్రాంతంలో మరీనా కొప్పల్ (39) హత్యకు గురైంది. మసాజ్ థెరపిస్టుగా ఉన్న ఆమె వేశ్యావృత్తిలోనూ ఉంది. ఆమె జీవితం గురించి భర్తకు పూర్తిగా తెలుసు. ఆ దంపతులకు పిల్లలు కూడా ఉన్నారు. నగరంలో తన ఫ్లాట్ లో ఉండే ఆమె, వారాంతాల్లో తన భర్తాపిల్లల వద్దకు వెళ్లి వస్తుండేది.
ఇదిలా ఉంటే, 1994లో ఓ వారాంతంలో మరీనా ఎంతకీ ఇంటికి రాకపోవడంతో భర్తకు అనుమానం మొదలైంది. దీంతో, మరీనా ఫ్లాట్‌కు వెళ్లి చూడగా ఆమె రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమెను 140 సార్లు పొడిచి హత్య చేసినట్టు నిర్ధారించారు. అప్పట్లోనే సందీప్ పటేల్‌పై అనుమానాలు వ్యక్తమైనా అతడి నేరం రుజువు చేసే బలమైన సాక్ష్యాలేవీ లభించలేదు.
బాధితురాలిని సందీప్ ఆమె ఫ్లాట్‌లోనే పొడిచి చంపాడు. ఘటనా స్థలంలో సందీప్ రక్తపుమరకలతో కూడిన పాదముద్రలు లభించినా అతడే దోషి అని పక్కాగా తేల్చే సాక్ష్యాలు చాలాకాలం పాటు లభించలేదు. అయితే, అప్పట్లో మృతురాలి ఉంగరానికి చుట్టుకుని ఉన్న వెంట్రుక పోలీసులకు లభించింది. దీన్ని విశ్లేషించే సాంకేతికత అందుబాటులో లేక కేసు ఓ మిసర్టీగా మారింది. ఈ క్రమంలో 2022లో అత్యాధునిక ఫోరెన్సిక్ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. దీని సాయంతో వెంట్రుకను పరీక్షించిన ఫోరెన్సిక్ నిపుణులు సందీప్ ఈ హత్య చేసినట్టు రుజువు చేశారు. దీంతో, అతడికి తాజాగా జీవిత ఖైదు ఖరారైంది.