TS Lok Sabha Survey: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దే హవా: పీపుల్స్ పల్స్ - సౌత్ ఫస్ట్ సర్వే
- కాంగ్రెస్ కు 8 నుంచి 10 సీట్లు వస్తాయన్న సర్వే
- 3 నుంచి 5 స్థానాలకే పరిమితం కానున్న బీఆర్ఎస్
- బీజేపీకి 2 నుంచి 4 స్థానాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ... రానున్న లోక్ సభ ఎన్నికల్లో సైతం సత్తా చాటబోతోందని పీపుల్స్ పల్స్ - సౌత్ ఫస్ట్ సర్వే తెలిపింది. మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 8 నుంచి 10 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 5 స్థానాలు... బీజేపీకి 2 నుంచి 4 పార్లమెంటు సీట్లను గెలుపొందే అవకాశం ఉందని తెలిపింది. ఎంఐఎం ఒక స్థానంలో గెలుస్తుందని వెల్లడించింది.
ఓట్ షేరింగ్ విషయానికి వస్తే కాంగ్రెస్ కు 40 శాతం, బీఆర్ఎస్ కు 31 శాతం, బీజేపీకి 23 శాతం, ఇతరులకు 6 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. కాంగ్రెస్ కు మహిళల్లో ఎక్కువ మద్దతు ఉందని తెలిపింది. 42 శాతం మహిళలు, 37 శాతం మంది పురుషులు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 42 శాతం, అర్బన్ సెంటర్లలో 37 శాతం మంది కాంగ్రెస్ కు మద్దతుగా ఉన్నారు. రేవంత్ ప్రభుత్వం బాగుందని 34 శాతం మంది అభిప్రాయపడగా... పర్వాలేదని 33 శాతం మంది చెప్పారు. ఫిబ్రవరి 11 నుంచి 17వ తేదీ వరకు ఈ సర్వేను నిర్వహించినట్టు పీపుల్స్ పల్స్ తెలిపింది. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని 3 అసెంబ్లీ సెగ్మెంట్లలో 4,600 శాంపిల్స్ సేకరించినట్టు వెల్లడించింది.