EC: లోక్ సభ ఎన్నికలపై ఈసీ కసరత్తు.. మార్చి రెండో వారంలో షెడ్యూల్!

Lok Sabha Election Schedule will be Released After March 9
  • రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సంసిద్ధతను పరిశీలించిన ఈసీ బృందాలు
  • లోక్ సభతో పాటు జమ్మూకశ్మీర్ సహా పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు
  • మార్చి 8, 9 తేదీలలో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈసీ బృందం భేటీ
  • ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా కలిపి నిర్వహించే యోచన
లోక్ సభ ఎన్నికల నిర్వహణపై ఎన్నికల సంఘం (ఈసీ) చేస్తున్న కసరత్తు పూర్తయిందని, వచ్చే నెలలో సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుందని సమాచారం. పార్లమెంట్ ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఈసీ బృందం కొన్ని రోజులుగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తోంది. పలు జాతీయ మీడియా సంస్థల కథనాల ప్రకారం.. మార్చి 9 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిసా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా షెడ్యూల్ విడుదల చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.

సార్వత్రిక ఎన్నికల కసరత్తులో భాగంగా పలు రాజకీయ పార్టీలు, స్థానిక అధికారులతో ఎన్నికల సంఘం అధికారులు సమావేశాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ అధికారులతో మార్చి 8, 9 తేదీల్లో ఈసీ బృంద భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సంసిద్ధతను పరిశీలించేందుకు మార్చి 12,13 తేదీల్లో జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నట్లు సమాచారం. గత లోక్ సభ ఎన్నికలకు 2019 మార్చి 10 న షెడ్యూల్ ప్రకటించిన ఈసీ.. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దశలలో పోలింగ్ నిర్వహించింది. మే 23న ఫలితాలను ప్రకటించింది.
EC
Lok Sabha
General Elections
Elections
Parliament Elections
Andhra Pradesh
Lok Sabha Polls

More Telugu News