Narendra Modi: తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎంల ప్రాంగణాలను ప్రారంభించిన మోదీ

PM Modi inaugurates IIT Tirupati and Vizag AIIMS
  • జమ్మూకశ్మీర్ నుంచి వర్చువల్ గా ప్రారంభించిన మోదీ
  • కర్నూలు ట్రిపుల్ ఐటీని జాతికి అంకితమిచ్చిన ప్రధాని
  • పాలమూరు యూనివర్శిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
తిరుపతి ఐఐటీ, విశాఖ ఐఐఎంల ప్రాంగణాలను ప్రధాని మోదీ ఈ రోజు ప్రారంభించారు. వీటిని జమ్మూకశ్మీర్ నుంచి ఆయన వర్చువల్ గా ప్రారంభించారు. విశాఖ ఐఐఎంను 2016 నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తాత్కాలిక క్యాంపస్ లో నిర్వహిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరం పంచాయతీ పరిధిలో స్థలం కేటాయించి మొదటి దశ భవనాలను పూర్తి చేశారు. తిరుపతి ఐఐటీని కూడా తాత్కాలిక క్యాంపస్ లో నిర్వహించారు. తిరుపతి జిల్లా ఏర్పేడు సమీపంలో ఐఐటీ, శ్రీనివాసపురంలో ఐసర్ భవనాలను పూర్తి చేశారు. ఈ భవనాలన్నింటినీ ప్రధాని మోదీ ఈరోజు ప్రారంభించారు. 

ఇదే సమయంలో కర్నూలు ట్రిపుల్ ఐటీని ప్రధాని జాతికి అంకితమిచ్చారు. నిజామాబాద్ లో కొత్తగా నిర్మించిన కేంద్రీయ విద్యాలయ సముదాయాన్ని ప్రారంభించారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... గత పదేళ్లలో దేశంలో పలు విద్యా సంస్థలను ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక్క జమ్మూకశ్మీర్ లోనే 50 కొత్త డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని తెలిపారు. 

గతంలో జమ్మూకశ్మీర్ లో బాంబులు, కాల్పులు, కిడ్నాప్ లు వంటి నిరాశాజనక వార్తలు మాత్రమే వచ్చేవని... కానీ, నేడు ఈ ప్రాంతం అభివృద్ధిలో ముందుకు సాగుతోందని మోదీ చెప్పారు. ఒకప్పుడు ఇక్కడ పాఠశాలలను తగులబెట్టేవారిని... ఇప్పుడు పాఠశాలలను అలంకరిస్తున్నారని అన్నారు. ఆర్టికల్ 370పై ఈ వారంలో సినిమా విడుదల కాబోతోందని విన్నానని... ఇది మంచి విషయమని చెప్పారు.
Narendra Modi
Tirupati IIT
Vizag AIIMS
BJP

More Telugu News