India vs England: నాలుగవ టెస్ట్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న రాంచీ మైదానంలో రికార్డులు ఇవే!

These are the records at the Ranchi ground which will host the 4th Test match between India vs England
  • రాంచీ జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో ఇప్పటివరకు 2 మ్యాచ్ లు ఆడిన భారత్
  • దక్షిణాఫ్రికాపై విక్టరీ.. ఆస్ట్రేలియాపై మ్యాచ్ డ్రా
  • భారత్, ఇంగ్లండ్ మధ్య నాలుగవ టెస్టులో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ
భారత్, ఇంగ్లండ్ మధ్య 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా అత్యంత కీలకమైన నాలుగవ టెస్ట్ మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌ వేదికగా జరగనుంది. శుక్రవారం నుంచి ఈ మ్యాచ్ మొదలుకానుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికి మూడు మ్యాచ్‌లు జరగగా 2-1 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉంది. అందుకే నాలుగవది అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తే మరో మ్యాచ్ మిగిలివుండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవశం చేసుకుంటుంది. అదే ఇంగ్లండ్ గెలిస్తే 2-2తో సిరీస్ సమం అవుతుంది. ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే భారత్ ఆధిక్యం కొనసాగనుంది. మ్యాచ్‌కు సమీకరణాల నేపథ్యంలో రాంచీలో టీమిండియా ట్రాక్ రికార్డు ఏ విధంగా ఉందనేది ఆసక్తికరంగా మారింది. 

ఇక రాంచీలో భారత్, ఇంగ్లండ్ మధ్య జరగనున్నది మొత్తం మీద చూస్తే మూడవ టెస్ట్ మ్యాచ్ కానుంది. అంతకుముందు రాంచీ మైదానంలో కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఈ రెండింట్లో ఒక మ్యాచ్‌లో భారత్ గెలవగా.. మరో మ్యాచ్ డ్రా అయ్యింది. 2017లో ఇండియా-ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్ డ్రా అయ్యింది. 2019లో ఇదే మైదానంలో దక్షిణాఫ్రికా‌పై భారత్ 202 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీనిని బట్టి చూస్తే రాంచీ మైదానంలో టీమిండియా గణాంకాలు సానుకూలంగానే ఉన్నాయని చెప్పాలి.

కాగా రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏకంగా 434 పరుగుల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీతో పాటు రెండవ ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసిన రవీంద్ర జడేజాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కిన విషయం తెలిసిందే.
India vs England
Cricket
Team India
JSCA

More Telugu News