Vemireddy Prabhakar Reddy: వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- నెల్లూరు జిల్లాలో వైసీపీకి మరో వికెట్ డౌన్
- వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన వేమిరెడ్డి
- రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపిన వైనం
- రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీ జిల్లా అధ్యక్ష పదవికి కూడా రాజీనామా
వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీని వీడారు. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్న వేమిరెడ్డి నేడు వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్ కు పంపించారు.
అంతేకాదు, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి కూడా వేమిరెడ్డి గుడ్ బై చెప్పేశారు. దాంతోపాటే, రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా తాను వదులుకుంటున్నానని వేమిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాలతో వైసీపీ నుంచి తప్పుకుంటున్నానని, తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని సీఎం జగన్ ను కోరారు.
గత ఎన్నికల సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ ఎంతో బలంగా ఉంది. అయితే, గత కొన్నాళ్లుగా జిల్లా వైసీపీలో అసంతృప్తి జ్వాలలు భగ్గుమంటున్నాయి. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి వైసీపీని వదిలి, టీడీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ నుంచి తప్పుకోవడం నెల్లూరు జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బగానే భావించాలి.
ఇటీవల నెల్లూరు సిటీ కోఆర్డినేటర్ మహ్మద్ ఖలీల్ ను నియమించే సమయంలో వేమిరెడ్డితో మాటమాత్రం చెప్పలేదని తెలుస్తోంది. అప్పటి నుంచి వైసీపీ కార్యకలాపాలకు వేమిరెడ్డి పెద్దగా హాజరు కావడంలేదు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ, అభ్యర్థుల నియోజకవర్గాల మార్పులు చేర్పుల అంశంలో ఆయన అభిప్రాయం తీసుకోకపోవడం మద్దతుదారుల్లోనూ అసంతృప్తిని రగిల్చిందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన మద్దతుదారులతో చర్చించిన అనంతరం వేమిరెడ్డి రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.