Pawan Kalyan: నన్ను ఎక్కడైనా ఆపాలని చూస్తే చేతల్లో చూపిస్తా: పవన్ కల్యాణ్
- భీమవరంలో పవన్ కల్యాణ్ పర్యటన
- గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని వెల్లడి
- వివిధ కులాలు కొట్టుకోవాలనేదే జగన్ నైజం అని విమర్శలు
- సొంత చెల్లెలికే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం ఇస్తారని వ్యాఖ్యలు
- ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కొనసాగాల్సిందేనని స్పష్టీకరణ
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ భీమవరంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డామని తెలిపారు. మీరు సిద్ధం అంటే... మేం యుద్ధం అంటాం... నన్ను ఎక్కడైనా ఆపాలని చూస్తే మాట్లాడను... చేతల్లో చూపిస్తా అని హెచ్చరించారు.
కులాలను విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. వివిధ కులాలు కొట్టుకోవాలనేదే జగన్ నైజం అని... కలిపేవారినే ప్రజలు గుర్తుంచుకుంటారు కానీ, విడదీసే వారిని కాదని స్పష్టం చేశారు.
సమాజానికి ఏది ఇస్తే అదే మనకు తిరిగి వస్తుంది... జగన్ విష సంస్కృతి తిరిగి ఆయన ఇంటికే వచ్చిందని పవన్ వ్యాఖ్యానించారు. సొంత చెల్లెలికే ఆస్తి ఇవ్వని వ్యక్తి మనకేం చేస్తారు? అని ప్రశ్నించారు.
అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం కూడా గొప్పేనా? అని ఎత్తిపొడిచారు. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని రక్షించాల్సి ఉందని అన్నారు.
తాము అధికారంలోకి వస్తే పథకాలు ఆపేస్తారని జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ ప్రభుత్వం వచ్చినా పథకాలు కొనసాగించాల్సిందేనని, సంక్షేమ పథకాలు భవిష్యత్ లోనూ కొనసాగుతాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. డబ్బుతో ఓట్లు కొనని రాజకీయాలు రావాలని అభిలషించారు. ఈసారి అధికారంలోకి వచ్చేది జనసేన-టీడీపీ కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. జనసేన-టీడీపీ కూటమికి బీజేపీ ఆశీర్వాదం కావాలని పవన్ మనసులో మాట వెల్లడించారు.