Asaduddin Owaisi: ఏజెంట్ల చేతిలో మోసపోయి యుద్ధరంగంలో చిక్కుకున్న తెలంగాణ యువకులు
- 12 మంది అమాయకులను ఉద్యోగాల పేరిట మోసగించారన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
- ఉద్యోగాలని చెప్పి రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో దింపారని వెల్లడి
- క్షేమంగా భారత్‌కు తీసుకొచ్చేందుకు చొరవ చూపాలని కోరిన హైదరాబాద్ ఎంపీ
- బాధితుల్లో ఇద్దరు తెలంగాణ యువకులు ఉన్నారని వెల్లడి
దుబాయ్‌కి చెందిన ఫైజల్‌ఖాన్, ముంబయికి చెందిన సుఫియాన్, పూజాలు అనే ఏజెంట్లు 12మంది అమాయక యువకులను ఉద్యోగం పేరుతో నమ్మించి రష్యా పంపించి, అక్కడి నుంచి ఉక్రెయిన్ యుద్ధ రంగంలోకి దింపారని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఆరోపించారు. ఏజెంట్లను నమ్మి మోసపోయిన వారిలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువకులు కూడా ఉన్నారని అన్నారు. ఇక్కడి ఏజెంట్లకు తోడుగా రష్యాలో ఉన్న రమేశ్, మోయిన్ అనే వ్యక్తులకు ఈ మోసంలో ప్రమేయం ఉందని అన్నారు. మోసపోయిన నిరుద్యోగులను సురక్షితంగా ఇండియా తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ప్రత్యేక చొరవ తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు.
రష్యాలో బిల్డింగ్ సెక్యూరిటీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వీరందరిని ఏజెంట్లు మోసగించారని, బాధిత కుటుంబాలు ఈ విషయాన్ని తనకు చెప్పాయని, ఈ మేరకు మంత్రి జైశంకర్‌తో పాటు రష్యాలో భారత రాయబారికి కూడా లేఖలు రాశానని వివరించారు. బాధితుల్లో ఇద్దరు తెలంగాణవారు కాగా మిగతా వ్యక్తులు కర్ణాటక, గుజరాత్, కశ్మీర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారని పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం విలేకరుల సమావేశంలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడారు.