Twitter: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు ‘నో’ చెప్పిన ఎలాన్ మస్క్ సారధ్యంలోని ‘ఎక్స్’

X accuses centre of issuing orders to censor content
  • నిర్దేశిత ఎక్స్ అకౌంట్లు, పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్న ఎక్స్ టీమ్
  • భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించే చర్యలు తీసుకోబోమని వెల్లడి
  • కేంద్రం ఆదేశాలపై రిట్ పిటిషన్ దాఖలు చేసినట్టుగా పేర్కొన్న ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం
ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ సారధ్యంలోని మైక్రోబ్లాగింగ్ సైట్ ‘ఎక్స్’ కేంద్ర ప్రభుత్వం అభ్యర్థనను తిరస్కరించింది. కొన్ని ఎక్స్ అకౌంట్లు, పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్రం ఆదేశించగా అందుకు నిరాకరించామని ఎక్స్ వెల్లడించింది. ఇలా చేస్తే భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు విరుద్ధంగా వ్యవహరించినట్టు అవుతుందని పేర్కొంది. 

‘‘ సూచించిన ఖాతాలు, పోస్టులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత ప్రభుత్వం ‘ఎక్స్’కు ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేసింది. జరిమానాలతో పాటు జైలు శిక్ష అవకాశాలను పరిశీలించాలని కోరింది. ఆదేశాలకు కట్టుబడి భారత్‌లో మాత్రమే ఈ అకౌంట్లు, పోస్టులను నిలిపివేస్తున్నాం. అయితే చర్యలు తీసుకునే విషయంలో మేము ఏకీభవించడం లేదు. భావప్రకటనా స్వేచ్ఛను ఈ పోస్టులకు కూడా వర్తింపజేయాలనుకుంటున్నాం’’ అని ఎక్స్ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ బృందం పోస్ట్‌ పెట్టింది.

కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఎక్స్
కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను సవాలు చేస్తూ ‘ఎక్స్’ కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. నిబంధనల ప్రకారం ప్రభావిత యూజర్లను గుర్తించామని, పారదర్శకత కోసం ప్రభుత్వ ఆదేశాలను బహిర్గతం చేశామని ఎక్స్ తెలిపింది. అయితే నిబంధనలకు విరుద్ధమైన డేటాను బహిర్గతం చేయలేదని, అలా చేయబోమని స్పష్టత ఇచ్చింది.
Twitter
Elon Musk
X Corp
Central Government

More Telugu News