PM Modi Tweet: రైతుల ఆందోళనల నేపథ్యంలో మోదీ ట్వీట్

PM Narendra Modi tweet regarding Protesting Farmers
  • రైతు సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ప్రధాని
  • క్యాబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలను ట్విట్టర్ లో పంచుకున్న మోదీ
  • చెరకు రైతులకు ప్రోత్సాహక ధర పెంచినట్లు వెల్లడి
తాము పండించిన పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రధాన డిమాండ్ తో ఢిల్లీ బార్డర్లలో రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. బుధవారం ఖనౌరీ బార్డర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బారికేడ్లు దాటి ఢిల్లీలోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు చేస్తున్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టియర్ గ్యాస్ ప్రయోగించినా రైతులు వెనక్కి తగ్గలేదు. ముఖానికి మాస్కులు, కళ్లద్దాలతో ముందుకే సాగారు. దీంతో పోలీసులు రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించారు. ఓ టియర్ గ్యాస్ షెల్ పగిలి మంటలు చెలరేగాయి. రబ్బర్ బుల్లెట్లు తగలడంతో పలువురు రైతులు గాయపడ్డారు. ఓ యువ రైతు ప్రాణాలు కోల్పోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతుల దాడిలో పలువురు పోలీసులు కూడా గాయపడ్డారు.

ఢిల్లీ బార్డర్ లో రైతుల ఆందోళనల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. రైతుల సంక్షేమానికి సంబంధించిన ప్రతి తీర్మానాన్ని నెరవేర్చడానికి కేంద్రం కట్టుబడి ఉందని ట్వీట్ చేశారు. ప్రస్తుత సీజన్ 2023-24లో చెరకు పండించే రైతులకు ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని (ఫెయిర్ అండ్ రెమ్యునరేటివ్ ప్రైస్–ఎఫ్ఆర్పీ) రూ.25 పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ప్రధాని మోదీ తన ట్వీట్‌ లో పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో దేశంలోని లక్షలాది చెరకు పండించే రైతులకు మేలు చేకూరనుందని వివరించారు.

ఆందోళన చేస్తున్న రైతులను కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి అర్జున్ ముండా మరోసారి చర్చలకు ఆహ్వానించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని సూచిస్తూ.. ఐదో విడత చర్చలకు పిలిచారు. రైతులపై నమోదైన కేసులను ఎత్తేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే, అన్ని పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించడంతో పాటు, ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించిన తర్వాతే మిగతా విషయాలపై చర్చిస్తామని రైతులు స్పష్టం చేసినట్లు సమాచారం.
PM Modi Tweet
Farmers protest
Delhi borders
Tear gas
Farmer death

More Telugu News