YS Sharmila: పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో నా చేతికి గాయమైంది: షర్మిల
- మెగా డీఎస్సీకి మద్దతుగా ఛలో సెక్రటేరియట్ చేపట్టిన ఏపీ కాంగ్రెస్
- కరకట్ట వద్ద షర్మిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మిగతా టీచర్ పోస్టులు భర్తీ చేసేంత వరకు తమ పోరాటం ఆగదన్న షర్మిల
నిరుద్యోగ సమస్యలు, మెగా డీఎస్సీ అంశంలో ఏపీ కాంగ్రెస్ నేతలు నేడు ఛలో సెక్రటేరియట్ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. మెగా డీఎస్సీకి మద్దతుగా కదం తొక్కిన పీసీసీ చీఫ్ షర్మిలను కరకట్ట వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్న షర్మిలను కిందికి దించగా, అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. రోడ్డుపైనే బైఠాయించి ధర్నా తెలిపేందుకు షర్మిల, ఇతర కాంగ్రెస్ నేతలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అక్కడ్నించి బలవంతంగా తరలించారు.
కాగా, పోలీసులు తనను అరెస్ట్ చేసే సమయంలో తన చేతికి స్వల్ప గాయమైందని షర్మిల వెల్లడించారు. జగన్ అధికారంలోకి వచ్చాక హామీలను మరిచారని విమర్శించారు. మిగతా టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసేంతవరకు తమ పోరాటం ఆగదని షర్మిల స్పష్టం చేశారు.
కాగా, పోలీసులు 151 నోటీసులు ఇచ్చి షర్మిలను పంపించి వేశారు.