YS Jagan: సీఎం జగన్ ప్రాణాలకు నక్సల్స్, టెర్రరిస్టులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు ఉందంటూ నిఘా నివేదిక
- సీఎం జగన్ భద్రతపై ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక
- సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని వెల్లడి
- ముఖ్యమంత్రికి అత్యంత భద్రత కల్పించాలని సిఫారసు
- రెండు హెలికాప్టర్లు సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రాణాలకు ముప్పు ఉందంటూ ఇంటెలిజెన్స్ డీజీపీ నివేదిక ఇచ్చారు. మావోయిస్టులు, ఉగ్రవాదులు, సంఘ విద్రోహ శక్తుల నుంచి సీఎం జగన్ కు ప్రాణహాని ఉందని ఆ నివేదికలో పేర్కొన్నారు. సీఎం జగన్ కు అత్యంత కట్టుదిట్టమైన భద్రత కల్పించాల్సి ఉందని డీజీపీ స్పష్టం చేశారు. మరి కొన్ని వారాల్లో ఏపీ ఎన్నికలకు వెళుతున్న నేపథ్యంలో ఈ నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ క్రమంలో సీఎం జగన్ పర్యటనల కోసం రెండు హెలికాప్టర్లను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఒక హెలికాప్టర్ ను విజయవాడలో, మరో హెలికాప్టర్ ను విశాఖలో అందుబాటులో ఉంచనున్నారు. మెస్సర్స్ గ్లోబర్ వెక్ట్రా సంస్థ ఈ హెలికాప్టర్లను లీజుకు తీసుకోనున్నారు. ఇవి రెండు ఇంజిన్లు కలిగిన బెల్ తయారీ హెలికాప్టర్లు.
ఒక్కో హెలికాప్టర్ కు నెలకు రూ.1.91 కోట్లు లీజు రూపేణా చెల్లించనున్నట్టు తెలుస్తోంది. ఇతర ఖర్చులను కూడా ప్రభుత్వమే చెల్లించనుంది. ఈ మేరకు మౌలిక వసతుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వులు ఇచ్చారు.
ప్రస్తుతం సీఎం వినియోగిస్తున్న హెలికాప్టర్ పాతదైపోయిందని ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. ప్రస్తుత హెలికాప్టర్ 2010 నుంచి వాడుకలో ఉన్నందున, దాన్ని మార్చాల్సి ఉందని వివరించింది.