Moons: చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన అమెరికా అంతరిక్ష నౌక

US Returns To Moons Surface For 1st Time In Over 50 Years As Intuitive Machine lander landed
  • 50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడిపై అడుగుపెట్టిన లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’
  • గురువారం సాయంత్రం 6.23 గంటల సమయంలో సురక్షితంగా ల్యాండింగ్
  • ఉపరితల పరస్పర చర్యలు, వాతావరణంలో చోటు చేసుకునే చర్యలపై పరిశోధనలు 
 అమెరికా దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై మరోసారి అడుగుపెట్టింది. అమెరికా కంపెనీ ‘ఇంటూటివ్ మెషీన్స్‌’కు చెందిన తొలి లూనార్ ల్యాండర్ ‘ఒడిస్సియస్’ చంద్రునిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండర్ ఒడిస్సియస్ అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 6:23 గంటల సమయంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగింది. నాసా, ఇతర కమర్షియల్ కంపెనీలకు చెందిన పరికరాలను ఒడిస్సియస్ చంద్రుడిపైకి మోసుకెళ్లింది. కాగా అమెరికాకు చెందిన చివరి మూన్ ల్యాండింగ్ మిషన్ 1972 డిసెంబర్‌లో జరిగింది. అపోలో మిషన్‌లో భాగంగా ‘అపోలో-17’ అంతరిక్ష నౌక చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.

కాగా ఫ్లోరిడాలోని నాసా ‘కెన్నెడీ స్పేస్ సెంటర్’ నుంచి గత గురువారం ఈ ప్రయోగాన్ని చేపట్టారు. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌ ద్వారా అంతరిక్ష నౌకను ప్రయోగించారు. ఐఎం-1 (IM-1) పేరుతో ఈ మిషన్‌ను నిర్వహించారు. ప్రైవేటు కంపెనీ ‘ఇంట్యూటివ్ మెషీన్స్’ చంద్రుడిపైకి పంపించిన మొట్టమొదటి రోబోటిక్ ఫ్లైట్ ఇదే కావడం గమనార్హం.

చంద్రుడి ఉపరితల పరస్పర చర్యలు, వాతావరణ చర్యలు, రేడియో ఖగోళ శాస్త్రానికి సంబంధించిన పరిశోధనలు ఈ ప్రయోగం ప్రధాన లక్ష్యాలుగా ఉన్నాయి. ల్యాండింగ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్, నావిగేషన్‌కు సంబంధించిన సామర్థ్యాలపై కూడా పరిశీలనలు చేయనున్నట్టు నాసా రిపోర్టులు చెబుతున్నాయి. కాగా చంద్రుడిపై పరిశోధనల కోసం పలు అమెరికా కంపెనీలతో నాసా కలిసి పనిచేస్తోంది.
Moons
Intuitive Machine
NASA
Odysseus
USA

More Telugu News