Lasya Nanditha: ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన లాస్య నందిత అంత్యక్రియలు
- ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే లాస్య నందిత కన్నుమూత
- ఈస్ట్ మారేడ్ పల్లి హిందూ శ్మశాన వాటికలో అంత్యక్రియలు
- భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు
- తుపాకులు గాల్లోకి పేల్చి గౌరవ వందనం సమర్పించిన పోలీసులు
రోడ్డు ప్రమాదంలో కన్నుమూసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత అంత్యక్రియలు సికింద్రాబాద్ లోని ఈస్ట్ మారేడ్ పల్లి హిందూ శ్మశాన వాటికలో ముగిశాయి. సికింద్రాబాద్ లోని కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లాస్య నందితకు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
తమ పార్టీ మహిళా నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. పార్టీ అగ్రనేతలు తన్నీరు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. పోలీసులు గౌరవ వందనంగా తుపాకులను గాల్లోకి పేల్చారు.
లాస్య నందితను కొన్నాళ్లుగా ప్రమాదాలు వెంటాడాయి. గతేడాది ఆమె ఓ లిఫ్టులో ఇరుక్కుపోయారు. దాదాపు 3 గంటల పాటు శ్రమించి ఆమెను బయటికి తీసుకు రాగలిగారు. ఇటీవలే ఓ రోడ్డు ప్రమాదం నుంచి స్వల్పగాయాలతో తప్పించుకున్నారు. ఇవాళ హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్డుపై సుల్తాన్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.