West Bengal: పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతున్నాం.. కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లిన తృణమూల్ కాంగ్రెస్

Trinamool Congress Says It Will Contest All 42 West Bengal Seats
  • తృణమూల్ తిరిగి టచ్‌లోకి వచ్చిందని, చర్చలు జరుగుతున్నాయన్న కాంగ్రెస్ 
  • అంతలోనే రాష్ట్రంలోని 42 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని తృణమూల్ స్పష్టీకరణ 
  • మమత ఇదివరకే క్లారిటీ ఇచ్చారన్న ఆ పార్టీ సీనియర్ నేత డెరెక్‌ ఓబ్రిన్ 
పశ్చిమ బెంగాల్‌లో ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకంపై ఫుల్ క్లారిటీ వచ్చింది. సీట్ల సర్దుబాటుపై తృణమూల్ పార్టీ తిరిగి టచ్‌లోకి వచ్చిందని, చర్చలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ వర్గాలు తెలిపిన గంటల వ్యవధిలోనే తృణమూల్ కాంగ్రెస్ సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంపై తమ పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ కొన్ని వారాల క్రితమే స్పష్టత ఇచ్చారని ఆ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓబ్రిన్ ప్రకటించారు. అసోంలోని కొన్ని సీట్లు, మేఘాలయలోని తురా లోక్‌సభ స్థానంలో పోటీ విషయంలో కూడా ఎలాంటి మార్పు లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు.

కాంగ్రెస్ కోరుతున్న స్థానాల సంఖ్యను 5కు తగ్గించుకున్నా తృణమూల్ కాంగ్రెస్ వెనక్కి తగ్గలేదని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. తృణమూల్‌కు అసోంలో 2, మేఘాలయలో ఒక సీటును ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటూ కాంగ్రెస్ ఆఫర్ చేసినా తలొగ్గలేదని సమాచారం.

ఇండియా కూటమికి ఎదురుదెబ్బ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రకటన ఇండియా కూటమికి ఎదురుదెబ్బ అని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీతో సీట్ల సర్దుబాటు పూర్తి చేసుకొని మిగతా రాష్ట్రాలపై కాంగ్రెస్ దృష్టి సారించిన వేళ జరిగిన ఈ పరిణామాన్ని ప్రతికూలంగా పరిగణించాలని అంటున్నారు. కాగా ఢిల్లీ, హర్యానా, గోవా, గుజరాత్‌లలో పోటీపై గత కొన్ని రోజులుగా ఆప్‌తో కాంగ్రెస్ చర్చలు జరుపుతున్న విషయం తెలిసిందే.
West Bengal
Trinamool Congress
Mamata Banerjee
Congress
INDIA Bloc

More Telugu News