Assam: ముస్లిం వివాహ చట్టం రద్దు.. యూసీసీ అమలు దిశగా అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం
- అసోం ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం-1935’ని రద్దు చేస్తూ కేబినెట్ నిర్ణయం
- రాష్ట్రంలో రద్దు కానున్న 94 ముస్లిం రిజిస్ట్రార్లు.. ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం ఇస్తామని ప్రభుత్వం ప్రకటన
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) అమలు దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ పాలిత అసోం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘అసోం ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం-1935’ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అసోం క్యాబినెట్ శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. సీఎం హిమంత బిస్వ శర్మ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. యూసీసీని సాధించే దిశగా ఇదొక ముందడుగు అని ఆ రాష్ట్ర మంత్రి జయంత మల్లబారువా వ్యాఖ్యానించారు. కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. యూసీసీ అమలు దిశగా అడుగులు వేస్తున్నామని సీఎం బిశ్వశర్మ ఇటీవలే ప్రకటించారని, ఈ ప్రయత్నంలో చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నామని ఆయన వ్యాఖ్యానించారు.
అసోం ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టం-1935ని రద్దు చేశామని, ఈ చట్టం కింద రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికీ 94 రిజిస్టార్లు పనిచేస్తున్నారని మంత్రి జయంత మల్లబారువా తెలిపారు. వారంతా శుక్రవారం నుంచే రద్దు అయ్యారని వెల్లడించారు. ఇకపై ముస్లింల వివాహాలు, విడాకుల నమోదును జిల్లా కమిషనర్, జిల్లా రిజిస్ట్రార్ చేపడతారని మంత్రి వివరించారు. 94 మంది ముస్లిం రిజిస్ట్రార్లకు ఒక్కొక్కరికి ఏకమొత్తంలో రూ.2 లక్షల చొప్పున పరిహారం ఇచ్చి విధుల నుంచి తొలగిస్తామని ప్రకటించారు. కాగా ముస్లిం వివాహ చట్టం రద్దుతో సంబంధిత అంశాలు ప్రత్యేక వివాహ చట్టం పరిధిలోకి రానున్నాయి.