Medaram Jatara: కుటుంబ సభ్యుల ముందే ఎస్సైని చెంపపై కొట్టిన ఎస్పీ.. మేడారం జాతరలో ఘటన
- అమ్మవార్ల దర్శనానికి వెళుతుండగా అడ్డుకున్న ఎస్పీ
- ఫ్యామిలీ ముందే కింద కూర్చోబెట్టి పనిష్మెంట్
- అసభ్య పదజాలంతో తిట్టారని ఆరోపణలు
మేడారం జాతర విధుల్లో ఉన్న ఓ ఎస్సైపై ఉన్నతాధికారి చేయిచేసుకోవడం వివాదాస్పదంగా మారింది. కుటుంబ సభ్యుల ముందే అవమానించడంపై పోలీసు సిబ్బంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. ఉన్నతాధికారులు కల్పించుకుని సర్దిచెప్పినట్లు తెలుస్తోంది. మేడారంలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ ఘటన వివరాలు..
వరంగల్ కమిషనరేట్ కు చెందిన ఏఆర్ ఎస్సై రవికుమార్ ప్రస్తుతం మేడారంలో జాతరలో డ్యూటీ చేస్తున్నారు. జాతరలో రోప్ పార్టీ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. కుటుంబ సభ్యులను క్యూలో పంపించే ప్రయత్నం చేస్తున్న రవికుమార్ పై అక్కడ డ్యూటీలో ఉన్న ఆదిలాబాద్ ఎస్పీ గౌస్ ఆలం సీరియస్ అయ్యారు.
కుటుంబ సభ్యుల ముందే రవికుమార్ పై చేయి చేసుకున్నారు. అసభ్య పదజాలంతో తిడుతూ, చెంపదెబ్బ కొట్టి, ఆయన భార్యా పిల్లలు చూస్తుండగానే రవికుమార్ ను నేలపై కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇచ్చారు. దీంతో రవికుమార్ కుటుంబం కన్నీటిపర్యంతమైంది. ఇదంతా చూసి అక్కడే ఉన్న ఇతర సిబ్బంది నిరసన తెలిపేందుకు ప్రయత్నించగా.. ఉన్నతాధికారులు సర్దిచెప్పారు.