Gorantla Butchaiah Chowdary: రాజమండ్రి రూరల్ టికెట్ నాదేనని చంద్రబాబు చెప్పారు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- సీట్ల పంపకంపై తొలి ప్రకటన చేసిన టీడీపీ-జనసేన కూటమి
- టీడీపీ జాబితాలో గల్లంతైన సీనియర్ల పేర్లు
- రాజమండ్రి రూరల్ టికెట్ ను ప్రకటించని వైనం
- జనసేన నేతలను ఒప్పించడానికే రాజమండ్రి రూరల్ ను ఆపారన్న గోరంట్ల
ఇవాళ టీడీపీ, జనసేన కూటమి సీట్ల పంపకంపై తొలి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాలు... జనసేన 24 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్నట్టు ఈ ప్రకటనలో వెల్లడించారు. టీడీపీ 94 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది.
అయితే ఈ జాబితాలో పలువురు సీనియర్లు కనిపించకపోవడం చర్చనీయాంశం అయింది. సీటుపై స్పష్టత లేని టీడీపీ సీనియర్లలో రాజమండ్రి రూరల్ సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా ఉన్నారు. ఇవాళ చంద్రబాబు, పవన్ సంయుక్త ప్రకటన చేసిన అనంతరం గోరంట్ల కీలక వ్యాఖ్యలు చేశారు.
రాజమండ్రి రూరల్ సీటు తనదే అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని అన్నారు. రాజమండ్రి రూరల్ టికెట్ నాకే ఇస్తామని చంద్రబాబు చెప్పారు అని గోరంట్ల వెల్లడించారు. జాబితాలో తన పేరు ఉంది కాబట్టే పవన్ కల్యాణ్ జనసేన తరఫున రాజమండ్రి రూరల్ టికెట్ ప్రకటించలేదని వివరించారు. జనసేన నేతలను ఒప్పించిన తర్వాతే సీటు ప్రకటించాలన్న ఉద్దేశంతోనే ఇవాళ్టి జాబితాలో రాజమండ్రి రూరల్ ను ఆపారని తెలిపారు. టికెట్ ఎవరికిచ్చినా కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు.
రాజమండ్రి రూరల్ స్థానం టికెట్ కోసం జనసేన నేత కందుల దుర్గేశ్ కూడా రేసులో ఉన్నారు. పవన్ కల్యాణ్ రాజమండ్రి రూరల్ టికెట్ తనకే ఇస్తానని చెప్పారంటూ దుర్గేశ్ చేసిన వ్యాఖ్యల వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి రూరల్ స్థానాన్ని టీడీపీ-జనసేన కూటమి పెండింగ్ లో పెట్టినట్టు అర్థమవుతోంది. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కలిసొచ్చే అంశం.