Dharani: ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై విచారణకు ఆదేశించిన సీఎం రేవంత్ రెడ్డి
- ధరణి పోర్టల్ అంశాలపై సచివాలయంలో సమీక్ష చేపట్టిన రేవంత్ రెడ్డి
- ప్రైవేటు ఏజెన్సీకి ఎలా అప్పగించారంటూ అధికారులను ప్రశ్నించిన వైనం
- బిడ్ దక్కించుకున్న కంపెనీ మారితే ప్రభుత్వం ఎలా అంగీకరించిందని ప్రశ్న
ధరణి పోర్టల్, సమస్యలు, పరిష్కారం తదితర అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న సంస్థపై విచారణకు ఆదేశించారు. పోర్టల్ నిర్వహణ ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడానికి గల కారణాలు ఏంటి? అని అధికారులను ప్రశ్నించారు. రైతుల ఆధార్ వివరాలు, బ్యాంకు అకౌంట్ల వివరాలు, భూమి సంబంధింత రికార్డులను విదేశీ సంస్థల పర్యవేక్షణకు ఎలా అంగీకరించారు? ఇలాంటి అత్యంత కీలక బాధ్యతలను విదేశీ సంస్థలకు అప్పగించే నిబంధనలు ఏవైనా ఉన్నాయా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. బిడ్ దక్కించుకున్న కంపెనీ స్థానంలో మరో కంపెనీ వచ్చిందంటున్నారు... అందుకు ప్రభుత్వం ఎలా అంగీకరించింది? అని అధికారులను అడిగారు.