Chandrababu: సర్వేల్లో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకు వెనుకాడం: చంద్రబాబు
- నిన్న టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన చంద్రబాబు
- జాబితాలో సీట్లు పొందినవారితో నేడు వర్చువల్ గా సమావేశం
- ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం
- అభ్యర్థుల పనితీరుపై ప్రతివారం సర్వే చేపడతామని వెల్లడి
తొలి జాబితాలో సీట్లు పొందినవారితో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు వర్చువల్ గా సమావేశం అయ్యారు. ఎన్నికల వరకు రోజువారీ చేపట్టాల్సిన పనులపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
వచ్చే 40 రోజులు అత్యంత కీలకం అని, నిత్యం ప్రజల్లో ఉండాలని పేర్కొన్నారు. అభ్యర్థుల పనితీరుపై ప్రతి వారం సర్వే చేపడతామని, సర్వేల్లో తేడా వస్తే అభ్యర్థులను మార్చేందుకు వెనుకాడబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రజలకు భవిష్యత్తుపై నమ్మకం, ధైర్యం కలిగించాలని... ప్రభుత్వ విధానాలు, ఎమ్మెల్యేల పనితీరును ఎండగట్టాలని టీడీపీ అభ్యర్థులకు పిలుపునిచ్చారు.
జనసేన క్యాడర్ ను సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తే వంద శాతం ఓట్ల బదిలీ జరుగుతుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎవరైనా అసంతృప్త నేతలు, కార్యకర్తలు ఉంటే వారి ఇళ్లకు వెళ్లి మాట్లాడాలని అన్నారు. తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని వివరించాలని తెలిపారు.
ఫీడ్ బ్యాక్ తీసుకుని, సర్వేలు పరిశీలించాలక అభ్యర్థులను ఎంపిక చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. జగన్ పై అసంతృప్తిగా ఉన్న వైసీపీ నేతలు వస్తే ఆహ్వానించాలని నిర్దేశించారు.
జగన్... దౌర్జన్యాలు, దొంగ ఓట్లను, డబ్బును నమ్ముకున్నారని విమర్శించారు. ఎన్నికల వేళ ఊహించని స్థాయిలో కుట్రలు, కుతంత్రాలకు పాల్పడతారని, సిద్ధంగా ఉండాలని అభ్యర్థులను హెచ్చరించారు.