IndiGo Flight: ల్యాండింగ్ సమయంలో పైలట్ కళ్లలోకి లేజర్ కాంతి.. తప్పిన పెను ప్రమాదం
- 165 మంది ప్రయాణికులతో బెంగళూరు నుంచి కోల్‌కతా బయలుదేరిన విమానం
- విమానం ల్యాండ్ కావడానికి కిలోమీటరు ముందు కాక్‌పిట్‌లోకి లేజర్ లైట్
- మసకబారిన పైలట్ కళ్లు.. మరికాసేపు పడి వుంటే కళ్లు పోయేవే!
ఆరుగురు సిబ్బంది, 165 మంది ప్రయాణికులతో శుక్రవారం బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానం కాక్‌పిట్‌లోకి శక్తిమంతమైన లేజర్ కిరణాలు చొచ్చుకెళ్లిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విమానం ల్యాండ్ కావడానికి కిలోమీటరు దూరంలో ఉండగా ఈ ఘటన జరిగింది. లేజర్ కిరణాలు కళ్లలో పడడంతో పైలట్ కళ్లు కాసేపు మసకబారాయి. మరికాసేపు లేజర్ కిరణాలు కళ్లలో పడివుంటే పైలట్ చూపు పోయేదే. ఈ ఘటనపై పైలట్లు బిదన్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విమానాశ్రయ సమీపంలో లేజర్ లైట్లు వాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ఇండిగో విమానం 6ఈ223 రన్‌వేను సమీపిస్తున్న వేళ కైఖాలి సమీపంలో ఈ ఘటన జరిగినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. లేజర్ కాంతి పడడం వల్ల పైలట్ కళ్లకు ఏమైనా జరిగి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు ల్యాండింగ్‌ను అడ్డుకోవడంతోపాటు ఆలస్యానికి కారణమవుతాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన డీజీసీఏ పైలట్ల కళ్లను రక్షించి, ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు విమానాశ్రయానికి 18.5 కిలోమీటర్ల పరిధిలో లేజర్ లైట్లు ఉపయోగించకుండా ఎక్స్‌క్లూజన్ జోన్‌గా చేయడాన్ని తప్పనిసరి చేసింది.