Teegala Krishna Reddy: కాంగ్రెస్‌లో చేరిన తీగల కృష్ణారెడ్డి, కోడలు అనితా రెడ్డి
- దీపాదాస్ మున్షీ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న తీగల
- రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని వ్యాఖ్య
- నిన్న బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన తీగల, కోడలు అనితా రెడ్డి
మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనతో పాటు కోడలు, రంగారెడ్డి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్ అనితా రెడ్డి కూడా కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. దీపాదాస్ మున్షీ వారికి కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ... సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు.
తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు అనితారెడ్డి నిన్న బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. వారు రాజీనామా లేఖలను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపించారు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం వల్లే వారు బీఆర్ఎస్‌ను వీడినట్లుగా చెబుతున్నారు. తీగల కృష్ణారెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు జీహెచ్ఎంసీ మేయర్‌గా పని చేశారు. 2014లో మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత బీఆర్ఎస్‌లో చేరారు.