KA Paul: పవన్ కల్యాణ్ కు ఇదే నా చివరి ఆఫర్... నీకు ఏం కావాలి?: కేఏ పాల్
- కేఏ పాల్ ఆవేశపూరిత మీడియా సమావేశం
- ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన మోదీ తొత్తులుగా ఉన్నాయని విమర్శలు
- పవన్ తనతో వస్తే 72 సీట్లు ఇస్తానని వెల్లడి
- కంపెనీలను అడిగి డబ్బు ఇప్పిస్తానని హామీ
ఏపీలో ఎన్నికల కోలాహలం పెరిగే కొద్దీ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సందడి కూడా ఎక్కువవుతోంది. విశాఖపట్నం ఎంపీగా తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. జై ప్రజాశాంతి పార్టీ అనండి అని పిలుపునిచ్చారు.
"ఆంధ్రప్రదేశ్ లో మోదీ తొత్తులైన టీడీపీ, వైసీపీ, జనసేనలను చిత్తు చిత్తుగా ఓడించండి. కనీసం 100 మందిని ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యేలుగా గెలిపించండి. పవన్ కల్యాణ్ కు మరొక ఆఫర్ ఇస్తున్నాను. ఇదే నీకు చివరి ఆఫర్! 24 సీట్లకు ఒప్పుకోవాల్సిన పరిస్థితి నీకెందుకు వచ్చింది?
నేను అప్పుడు నీకు 48 సీట్లు ఇస్తానన్నాను... ఇప్పుడు నీకు 72 సీట్లు ఇస్తాను. 50 మంది కాపులను నిలబెట్టి నేను గెలిపిస్తా. 70, 80 మంది బీసీలను నిలబెట్టి నేను గెలిపిస్తా... ఎంత ఖర్చయినా ఫర్వాలేదు. నేను చెబితే ఏ కంపెనీ వాడైనా నీ పార్టీకి రూ.100 కోట్లు ఇచ్చేస్తారు.
ఏపీలో నిన్ను గెలిపించే బాధ్యత నాది. నేను ఎంపీగా గెలిచి విదేశాంగ మంత్రినవుతా. ఏపీకి నిన్ను ముఖ్యమంత్రిని చేస్తా. జనసైనికులారా వింటున్నారా... ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు? వాళ్లు 24 ఇస్తే... అందుకు మూడు రెట్లు ఎక్కువగా 72 సీట్లు మేం ఇస్తాం. వాళ్లు రూ.100 కోట్లు ఇప్పిస్తే, నేను రూ.వెయ్యి కోట్లు ఇప్పిస్తా. లక్షల కోట్లు ఉన్న గూగుల్, మైక్రోసాఫ్ట్ వాళ్లు ఇస్తారు... నీకెంత డబ్బు కావాలి?" అంటూ ఓపెన్ ఆఫర్ ఇస్తున్నట్టు ప్రకటించారు.
"ఈ అన్నయ్య చెప్పినవన్నీ దైవ ప్రవచనాలని ఇప్పుడు అర్థమైందా...! ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారని 2008-09లోనే చెప్పాను... 2011లో కలిపేశారా? లేదా? మీకు 15 నుంచి 20 సీట్లు వస్తాయని చెప్పాను... 2009లో 18 సీట్లు వచ్చాయా, లేదా? మీకు ఓటింగ్ శాతం 15 నుంచి 20 మధ్యలో వస్తుందని చెప్పాను... మీకు 18 శాతం ఓట్లు వచ్చాయా? లేదా?
నా మాటలు దైవ ప్రవచనాలు. రాజశేఖర్ రెడ్డి నా పీస్ మిషన్ ను క్యాన్సిల్ చేశారు. నన్ను చిత్రహింసలు చేస్తున్నందుకు ముక్కలు ముక్కలు అయిపోతావ్... ఆ ముక్కలు కూడా దొరకవని వంద సార్లు అన్నాను... ముక్కలు ముక్కలు అయిపోయాడా? లేదా?
కేసీఆర్ లక్షల కోట్లు ఖర్చు పెట్టినా చిత్తుగా ఓడిస్తామని చెప్పాం... ఓడించామా? లేదా? ఒక్క ఓటు కూడా లెక్కపెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతాడని చెప్పాను... చానల్స్ అన్నీ లైవ్ ఇచ్చాయి... సీఎం అయ్యాడా? లేదా? వెంటనే తమ్ముడు (రేవంత్ రెడ్డి) నేను ఉన్న దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాడు.
ఇంకెన్నిసార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి... దేశం నాశనమైపోతోంది, రాష్ట్రం నాశనమైపోతోంది. ఇప్పుడున్నవాళ్లందరూ మోదీ తొత్తులు. రాష్ట్రాన్ని రక్షించాలన్నా, దేశాన్ని రక్షించాలన్నా, ఆర్థిక వ్యవస్థను రెట్టింపు అభివృద్ధి చేయాలన్నా... ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి" అని పిలుపునిచ్చారు.