Open Book Exams: ఓపెన్ బుక్ పరీక్షల విధానంపై స్పష్టత నిచ్చిన సీబీఎస్ఈ
- దేశంలో ఓపెన్ బుక్ పరీక్ష విధానం అమలుకు ప్రతిపాదన
- సీబీఎస్ఈ ప్రతిపాదనపై భిన్నాభిప్రాయాలు
- ఇప్పటికిప్పుడు ఓపెన్ బుక్ పరీక్షలు జరపబోమన్న సీబీఎస్ఈ
- నివేదిక వచ్చాకే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి
పాశ్చాత్య దేశాల తరహాలో ఓపెన్ బుక్ పరీక్షల విధానం తీసుకువచ్చేందుకు సీబీఎస్ఈ సిద్ధమవుతోంది. అయితే, సీబీఎస్ఈ ప్రణాళికపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మన దేశ విద్యావ్యవస్థకు ఓపెన్ బుక్ పరీక్షల విధానం సరిపడదని కొందరు వాదిస్తున్నారు. మరికొందరు ఓపెన్ బుక్ విధానానికి అనుకూలంగా ఓటేస్తున్నారు.
9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జాతీయ కర్రిక్యులమ్ ఫ్రేమ్ వర్క్ లో భాగంగా ఓపెన్ బుక్ విధానంలో పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ ఓ ప్రతిపాదన తీసుకువచ్చింది. దీనిపై రకరకాల వార్తలు ప్రచారం అవుతుండడంతో సీబీఎస్ఈ స్పందించింది.
ప్రస్తుతం తాము ఓపెన్ బుక్ పరీక్షల విధానంపై వివిధ పాఠశాలల్లో అధ్యయనం చేస్తున్నామని వెల్లడించింది. మనదేశంలోని పాఠశాలలకు ఓపెన్ బుక్ విధానం అనువైనదా? కాదా? అనేది పరిశీలిస్తున్నామని తెలిపింది.
ఇప్పటికిప్పుడు ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించే ఆలోచనేదీ లేదని సీబీఎస్ఈ స్పష్టం చేసింది. అధ్యయనం తాలూకు నివేదికలు వచ్చాకే దీనిపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది.