Tammineni Sitaram: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
- ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ టీడీపీ, వైసీపీ పిటిషన్లు
- ఇటీవల విచారణ ముగించిన స్పీకర్ తమ్మినేని సీతారాం
- న్యాయనిపుణుల సలహా అనంతరం అనర్హత వేటు
ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు. 8 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై టీడీపీ, వైసీపీ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఆనం రామనారాయణరెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిలను అనర్హులుగా ప్రకటించాలని వైసీపీ తన పిటిషన్ లో పేర్కొనగా... కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేశ్ లను అనర్హులుగా ప్రకటించాలంటూ టీడీపీ తన పిటిషన్ లో కోరింది.
ఇటీవలే అనర్హత పిటిషన్లపై విచారణ ముగిసింది. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన స్పీకర్ తమ్మినేని సీతారాం న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకున్నారు. అనంతరం ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ నిర్ణయం వెలువరించారు.