KTR: జలయజ్ఞం కాదది కాంగ్రెస్ ధనయజ్ఞం: కేటీఆర్

BRS Mla KTR Press Meet At Telangana Bhavan in Hyderabad
  • ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లివ్వకుండా కన్నీళ్లు పెట్టించిందని ఫైర్
  • నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడామని వివరణ
  • మేడిగడ్డపై రేవంత్ సర్కారు దుష్ప్రచారం చేస్తోందని విమర్శ 
  • వాస్తవాలు చెప్పేందుకే ‘చలో మేడిగడ్డ’
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మండిపడ్డారు. వందల కిలోమీటర్ల మేర గోదావరి నది ప్రవహిస్తున్నా సరే తెలంగాణ ప్రాంతం గతంలో ఎడారిగా ఉండేదన్నారు. గతంలో జలయజ్ఞం పేరుతో కాంగ్రెస్ సర్కారు చేపట్టిన కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు. ‘జలయజ్ఞం కాదది ధనయజ్ఞం’ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ప్రాంతం గర్జించిందని నాటి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. ఈమేరకు మంగళవారం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

ప్రస్తుతం రేవంత్ సర్కారు కూడా అదే తీరులో సాగుతోందని, మేడిగడ్డపై దుష్ప్రచారం చేస్తోందని కేటీఆర్ విమర్శించారు. మేడిగడ్డ బ్యారేజ్ లో మొత్తం 84 పిల్లర్లు ఉండగా కేవలం 3 పిల్లర్లు మాత్రమే కుంగిపోయాయని కేటీఆర్ చెప్పారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం మొత్తం బ్యారేజ్ కొట్టుకుపోయినట్లు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ప్రజలకు వాస్తవాలు చూపించేందుకు బీఆర్ఎస్ తరఫున ప్రయత్నిస్తామని వివరించారు. మార్చి 1 నుంచి చలో మేడిగడ్డ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రతినిధులతో మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శిస్తామని, కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర స్వరూపాన్ని ప్రజలకు చూపెడతామని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
KTR
BRS
Telangana Bhavan
Chalo Medigadda
Congress
Revanth Reddy
Kaleshwaram Project

More Telugu News