Gaganyaan: గగన్ యాన్ ప్రాజెక్టు: అంతరిక్షంలోకి వెళ్లే భారత వ్యోమగాముల పేర్లు ప్రకటించిన ప్రధాని మోదీ

PM Modi introduced four astronauts who will participate in Gaganyaan
  • మంగళ్యాన్, చంద్రయాన్-3తో మరింత పెరిగిన భారత్ ఖ్యాతి
  • 2025లో గగన్ యాన్ చేపడుతున్న ఇస్రో
  • తొలిసారి మానవ సహిత యాత్రకు సిద్ధం
  • ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన గ్రూప్ కెప్టెన్లను వ్యోమగాములుగా పరిచయం చేసిన మోదీ  
ఇప్పటికే మంగళ్యాన్, చంద్రయాన్-3 విజయాలతో అంతరిక్ష పరిశోధనల రంగంలో భారత్ ఖ్యాతి ఇనుమడించింది. ఈ క్రమంలో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత్ గగన్ యాన్ కు సిద్ధమైంది. భారత్ కు ఇదే తొలి మానవ సహిత రోదసి యాత్ర. 

ఇంతటి ప్రతిష్ఠాత్మక గగన్ యాన్ ప్రాజెక్టులో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లే భారత వ్యోమగాముల పేర్లను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రకటించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (ఐఏఎఫ్) కు చెందిన గ్రూప్ కెప్టెన్లు అజిత్ కృష్ణన్, ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా గగన్ యాన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా రోదసిలోకి వెళ్లనున్నారని మోదీ తెలిపారు. 

ఇవి నాలుగు పేర్లు కాదు... 140 కోట్ల మంది భారత ప్రజల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకెళ్లే శక్తులు అని అభివర్ణించారు. కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రధాని మోదీ ఈ నలుగురు వ్యోమగాములను పరిచయం చేశారు. 40 ఏళ్ల కిందట రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లగా... మళ్లీ ఇన్నాళ్లకు భారతీయులు అంతరిక్షంలోకి వెళుతున్నారని... అయితే ఈసారి కౌంట్ డౌన్ మనదే, రాకెట్ మనదే అని స్పష్టం చేశారు.

 రాకేశ్ శర్మ 1984 ఏప్రిల్ 3న రష్యా వ్యోమనౌక సోయుజ్ టి-11 ద్వారా మరో ఇద్దరు రష్యన్లతో కలిసి అంతరిక్షంలోకి వెళ్లాడు. ఇప్పుడు, మరోసారి భారతీయులు అంతరిక్షంలోకి వెళుతుండగా, ఆ నలుగురు వ్యోమగాములకు కూడా రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రాస్ కాస్మోస్ శిక్షణ ఇచ్చింది. 

ఈ నేపథ్యంలో, గగన్ యాన్ భారత అంతరిక్ష రంగాన్ని సరికొత్త ఎత్తులకు చేర్చనుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. కాగా, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపడుతున్న గగన్ యాన్ వచ్చే ఏడాది జరగనుంది.
Gaganyaan
Astronauts
Narendra Modi
ISRO
India

More Telugu News