Amaravati Farmers: రాజధాని రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట

Huge consolation for Amaravati farmers in AP High Court

  • ఏపీ రాజధాని అమరావతి కోసం నాడు భూములు ఇచ్చిన రైతులు
  • సీఆర్డీఏ చట్టం ప్రకారం రైతులకు ప్లాట్ల కేటాయింపు
  • వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్లాట్ల కేటాయింపు రద్దు
  • హైకోర్టును ఆశ్రయించిన రైతులు
  • ప్లాట్ల రద్దు నోటీసులను కొట్టివేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు 

రాజధాని అమరావతి రైతులకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. రైతులకు ఇచ్చిన ప్లాట్లను రద్దు చేస్తూ ఇచ్చిన నోటీసులను ఏపీ హైకోర్టు నేడు కొట్టివేసింది. 

రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు గతంలో సీఆర్డీయే ప్లాట్లు ఇచ్చింది. అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ ప్లాట్లను రద్దు చేశారు. ప్లాట్లను రద్దు చేస్తున్నట్టు సీఆర్డీఏ, రెవెన్యూ అధికారులు 862 మంది రైతులకు నోటీసులు ఇచ్చారు. దాంతో రైతులు హైకోర్టును ఆశ్రయించారు. 

ప్లాట్ల రద్దు అన్యాయం అంటూ ప్రభుత్వ నోటీసులను సవాల్ చేస్తూ పిటిషన్లు దాఖలు చేశారు. ప్లాట్లు రద్దు చేయడం అంటే సీఆర్డీయే చట్టాన్ని ఉల్లంఘించడమేనని పిటిషనర్ల తరఫు న్యాయవాది హైకోర్టు ధర్మాసనానికి విన్నవించారు. ప్లాట్ల రద్దు నిర్ణయం రాజధాని మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకం అని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 

పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు, ఇంద్రనీల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ... చట్టంలో మార్పులు చేశామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం రాజధాని రైతులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్ ఇచ్చిన ప్లాట్ల రద్దు నోటీసులు చెల్లవని స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News