Revanth Reddy: బిడ్డా! నువ్వు వస్తావా? నీ అయ్య వస్తాడా? చూసుకుందాం: కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
- నేనే సీఎం.. నేనే పీసీసీ చీఫ్... నువ్వు మొగోడివైతే పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలవాలంటూ సవాల్
- జైల్లో మగ్గినప్పటికీ ఎవరికీ లొంగకుండా నిన్ను... నీ అయ్యను... నీ బావను... బొందపెట్టి సీఎం కుర్చీలో కూర్చున్నానని వ్యాఖ్య
- ఈ కుర్చీ తనకు ఉందంటే అది కార్యకర్తల త్యాగం... పోరాట ఫలితమేనన్న సీఎం రేవంత్ రెడ్డి
- బీఆర్ఎస్ చేసిన తప్పులను తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారన్న ముఖ్యమంత్రి
- కృష్ణా నగర్లో ఏదైనా బ్రోకర్ దందా పెట్టుకుంటే వ్యాపారం బాగానే నడుస్తుందంటూ చురక
'రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు గెలిచి చూపించు బిడ్డా... నువ్వు వస్తావా? నీ అయ్య వస్తాడా? చూసుకుంటాం బిడ్డా' అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బిడ్డా, సన్నాసి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేవెళ్లలో జన జాతర పేరుతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఘాటైన విమర్శలు చేశారు.
నేను ఆ సన్నాసులకు ఓ విషయం చెప్పదలుచుకున్నాను.... మూడు నెలల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత ఈ ప్రభుత్వం ఉండదని గ్రామాల్లోకి వచ్చి ఎవరైనా చెబితే మా కార్యకర్తలు వారిని పట్టుకొని వేపచెట్టుకు కట్టేసి లాగుల్లో తొండలు విడిచి కొడతారని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి పేరు చెబితే మూడు సీట్లు కూడా రాకపోతుండెనని కేటీఆర్ సొల్లు వాగుడు వాగుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆయనకు ఓ సవాల్ విసురుతున్నానని... ఇప్పుడు నేనే సీఎంను, నేనే పీసీసీ చీఫ్‌ను... రానున్న లోక్ సభ ఎన్నికల్లో మీకు చేతనైతే... మీకు దమ్ముంటే... నువ్వు మొగోడివైతే... తెలంగాణలో... బిడ్డా ఒక్క సీటు గెలిచి చూపించు అని సవాల్ చేశారు.
నువ్వు వస్తావా... నీ అయ్య వస్తాడా... మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డా అని హెచ్చరించారు. "అల్లాటప్పాగాడు అని నువ్వు అనుకుంటున్నావేమో... మేం అయ్య పేరు చెప్పుకోలేదు... కిందిస్థాయి నుంచి... కార్యకర్తగా కష్టపడి... లాఠీదెబ్బలు తిని... నీ అక్రమ కేసులు ఎదుర్కొని... చర్లపల్లి, చంచల్‌గూడ జైల్లో మగ్గినప్పటికీ... భయపడకుండా, లొంగిపోకుండా నిటారుగా నిలబడి నిన్ను... నీ అయ్యను... నీ బావను... బొందపెట్టి ఈరోజు ఆ కుర్చీలో కూర్చున్నా" అన్నారు. ఈ కుర్చీ తనకు ఇనామ్ కింద వచ్చింది కాదని... అయ్య పేరు చెబితే వచ్చింది కాదన్నారు. నల్లమల అడవి నుంచి తొక్కుకుంటూ వచ్చి... నీలాంటి వాడి నెత్తిమీద కాలుపెట్టి తొక్కి... మా కార్యకర్తలు తనను ఆ కుర్చీ మీద కూర్చోబెట్టారన్నారు.
ఈ రోజు ఆ కుర్చీ తనకు ఉందంటే అది కార్యకర్తల త్యాగం... పోరాట ఫలితమే అన్నారు. ఈ కార్యకర్తలు తనను భుజాల మీద మోసినంత కాలం నువ్వు కాదు... నువ్వు పుట్టించిన నీ అయ్య కూడా కాదు... వాళ్ల దేవుడు వచ్చినా ఆ కుర్చీని మీరు తాకలేరని వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా ఉంటే మేం గెలిచేవాళ్లమని కేటీఆర్ అంటున్నారని... కానీ ఉన్న టీవీలు అన్నీ ఆ సన్నాసి సుట్టపోల్లవే అని ఘాటుగా విమర్శించారు. మాకు ఏమైనా టీవీ ఉందా? పేపర్ ఉందా? సాయంత్రం సేద తీరేందుకు జుబ్లీహిల్స్‌లో సినిమా వాళ్ల గెస్ట్ హౌస్ ఉందా? అని కేటీఆర్‌ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మా కార్యకర్తల కష్టఫలంతో... వారు నిలబడి కొట్లాడితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ చేసిన తప్పులను తమ పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టారని వెల్లడించారు. మాకు ఆ ట్యూబ్ అక్కరలేదు... ఈ ట్యూబ్ అక్కరలేదు... ఏ ట్యూబ్ అక్కరలేదు... బిడ్డా నీ ట్యూబ్ లైట్ పగులగొట్టే బాధ్యతను మేం తీసుకుంటామని హెచ్చరించారు.
ఆయన ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటామని చెబుతున్నాడని... అలాగే కృష్ణా నగర్లో ఏదైనా బ్రోకర్ దందా పెట్టుకుంటే నీ వ్యాపారం బాగానే నడుస్తుందని చురక అంటించారు. ఇప్పటికీ వారికి సిగ్గురాలేదని... ఆ కుటుంబం దోచుకుంటేనే తెలంగాణ ప్రజలు చెప్పు తీసుకొని కొట్టారనే విషయం ఆయనకు అర్థం కాలేదన్నారు. అడవి పందులు చెరుకు తోట మీద పడినట్లుగా పదేళ్లు తెలంగాణను దోచుకున్నారని ఆరోపించారు. అందుకే అడవి పందులకు కరెంట్ తీగలు పెట్టి పంటను కాపాడుకున్నట్లు తెలంగాణ ప్రజలు కరెంట్ వైర్లు పెట్టి బీఆర్ఎస్ను బలిచ్చి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకు వచ్చుకున్నారన్నారు.