Magunta Sreenivasulu Reddy: వైసీపీకి షాక్.. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా
- రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన మాగుంట
- ఆత్మాభిమానాన్ని చంపుకోలేనని వ్యాఖ్య
- మార్చి తొలి వారంలో టీడీపీలో చేరే అవకాశం
ఏపీలో అధికార వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ప్రకటించారు. కాసేపటి క్రితం మీడియాతో ఆయన మాట్లాడుతూ... 33 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని... ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే ఒక బ్రాండ్ అని చెప్పారు. 8 సార్లు పార్లమెంటుకు, 2 సార్లు శాసనసభకు, ఒకసారి ఎమ్మెల్సీ పదవికి మొత్తం 11 సార్లు చట్ట సభలకు పోటీ చేశానని తెలిపారు. తమ కుటుంబానికి అహం లేదని, ఆత్మగౌరవం మాత్రమే ఉందని చెప్పారు. వైసీపీని వీడటం బాధాకరమే అయినప్పటికీ తప్పడం లేదని అన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకోలేమని చెప్పారు. ఒంగోలు ఎంపీ బరిలో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని నిలపాలని నిర్ణయించామని తెలిపారు.
మాగుంటను వైసీపీ హైకమాండ్ దూరం పెట్టిన సంగతి తెలిసిందే. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జగన్ ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో మాగుంట తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. మార్చి మొదటి వారంలో ఆయన టీడీపీలో చేరనున్నట్టు సమాచారం.