Ponnam Prabhakar: చేతులెత్తి మొక్కుతున్నా.. బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దు: పొన్నం ప్రభాకర్
- పార్టీ కార్యకర్తలు, ప్రజలకు విజ్ఞప్తి చేసిన మంత్రి పొన్నం
- ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలిగించొద్దని సూచన
- తన తల్లిని అవమానించినా సంయమనంతో ఉంటున్నానని వెల్లడి
ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దని, పరీక్షలు సాఫీగా జరిగేందుకు సహకరించాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. బీజేపీ నేత బండి సంజయ్ యాత్రను అడ్డుకోవద్దంటూ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నానని పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతలు యాత్రను అడ్డుకుంటారని బీజేపీ నేతలు సెక్యూరిటీ కోరితే ఇంటర్ విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. రాష్ట్రంలో బుధవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ కల్పించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ క్రమంలో బండి సంజయ్ యాత్రకు బందోబస్తు కల్పించాల్సి వస్తే పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ లేకుండా పోతుందన్నారు. ఇతరత్రా శాంతిభద్రతల సమస్యలు ఎదురవుతాయని, అందుకే బండి యాత్రను అడ్డుకోవద్దని చెప్పారు. అదే సమయంలో రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని బీజేపీ నేతలకు హితవు పలికారు. ఈ మేరకు బుధవారం ఉదయం పొన్నం ప్రభాకర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఓ వీడియో ట్వీట్ చేశారు.
"ఐదేళ్లు ఎంపీగా ఉన్నా నియోజకవర్గంలో ఒక్కసారి కూడా కనిపించని బండి సంజయ్.. ఎన్నికలు వస్తున్నాయని మళ్లీ యాత్రలంటూ నియోజకవర్గానికి వస్తున్నాడు. ఇన్నాళ్లూ ప్రజల సమస్యలు పట్టించుకోలేదు. ఇప్పుడు హుస్నాబాద్ ప్రజలను మళ్లీ మభ్య పెట్టేందుకు యాత్ర చేస్తున్నాడు. నా వ్యాఖ్యల కారణంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో బండి సంజయ్ యాత్రకు దాదాపు 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయాల్సి వచ్చింది. ఇంటర్ పరీక్షలు జరుగుతున్న వేళ పోలీసు బలగాలను యాత్రలకు బందోబస్తు కోసం పంపితే పరీక్షా కేంద్రాల వద్ద సెక్యూరిటీ లేకుండా పోతుంది. విద్యార్థులకు ఇబ్బంది కలుగుతుంది. ప్రజాశీర్వాదంతో గెలిచిన నాకు ప్రజా సేవే ముఖ్యం. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ప్రజలకు సేవ చేయడంపైనే పూర్తిగా దృష్టిపెట్టాను. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకోవాలనే ఉద్దేశం మాకు లేదు. ఆయన మతిభ్రమించి చేసిన వ్యాఖ్యలకు బాధ కలిగినా సంయమనం పాటిస్తున్నా. ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కలగకూడదనే మౌనంగా ఉంటున్నా. నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ శ్రేణులు కూడా సంయమనం పాటించాలని రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నా.. బండి సంజయ్ యాత్రను ఎక్కడా అడ్డుకోవద్దు" అని మంత్రి పొన్నం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కోరారు.