Pawan Kalyan: జగన్ నిన్ను పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు : పవన్ కల్యాణ్
- తాడేపల్లిగూడెం సభలో జగన్ పై నిప్పులు చెరిగిన పవన్
- సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తామని వ్యాఖ్యలు
- జగన్... నీ కోటలు బద్దలు కొడతాం అంటూ తీవ్ర స్వరంతో హెచ్చరిక
తాడేపల్లిగూడెం సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు. సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్... సామాన్యుడు రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాం. జగన్... నీ కోటలు బద్దలు కొడతాం అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
తాము 24 ఎమ్మెల్యే సీట్లకు, 3 ఎంపీ సీట్లకు ఒప్పుకోవడం పట్ల వైసీపీ నేతలు విమర్శిస్తున్నారని... కానీ వామనుడ్ని చూసి బలిచక్రవర్తి కూడా ఇంతేనా అనుకున్నాడని, ఆ తర్వాత నెత్తిమీద కాలుబెట్టి తొక్కేసరికి అది 'ఎంతో' అని అప్పుడు అర్థమైందని అన్నారు. వామనుడిలాగా నిన్ను అథఃపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కల్యాణ్ కాదు, నా పార్టీ పేరు జనసేన కాదు... అంటూ సవాల్ విసిరారు.
"మనం ఏమిటో వైసీపీ వాళ్లకు ఎన్నికల తర్వాత అర్థమవుతుంది... నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా... అప్పుడు అర్థమవుతుంది మేమేంటో. జగన్... జనసేన ఒక్క సీటు గెలిస్తేనే... నేను రాజమండ్రికి వస్తుంటే రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. 10వ తరగతి పిల్లలు రాత్రంతా చదువుకుని పరీక్షకు సిద్ధమైనట్టు మీరు రాత్రికి రాత్రి రోడ్లు వేశారు. ఇప్పటిదాకా పవన్ కల్యాణ్ తాలూకు శాంతినే చూశావు... ఇక నా యుద్ధం ఏంటో చూస్తావు" అంటూ హెచ్చరించారు.