Shreyas Iyer: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ల ‘బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టుల రద్దు’పై స్పందించిన రవిశాస్త్రి
- రంజీ ట్రోఫీలో ఆడాలనే నిబంధనను ఉల్లంఘించినందున ఇషాన్, శ్రేయాస్ లపై వేటు
- ఇద్దరూ తిరిగి పుంజుకొని బలంగా జట్టులోకి పునరాగమనం చేయాలని ఆకాంక్షించిన క్రికెట్ దిగ్గజం
- సవాళ్లను అధిగమించాలని సూచన
రంజీ ట్రోఫీలో ఆడాలనే నిబంధనను ఉల్లంఘించిన యువక్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌పై బీసీసీఐ వేటు వేసింది. వీరిద్దరినీ సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తప్పించింది. ఈ పరిణామంపై టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం రవిశాస్త్రి స్పందించారు. ఇద్దరూ తిరిగి బలం పుంజుకోవాలని, జట్టులోకి పునరాగమనం చేయాలని ఆయన సూచించారు. ‘‘క్రికెట్‌లో పునరాగమనాలను స్ఫూర్తిగా నిర్వచిస్తుంటారు. శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్ లోతుగా పరిశీలించుకోండి. సవాళ్లను అధిగమించండి. మరింత బలంగా తిరిగి రండి. గతంలో మీరు సాధించిన విజయాలు మీ సామర్థ్యాలకు నిదర్శనం. మీరు మరొకసారి గెలుస్తారనడంలో సందేహం లేదు’’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.
కాగా బీసీసీఐ బుధవారం రాత్రి ఈ ఏడాది ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులను ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టాప్ కాంట్రాక్టులో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. అయితే శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ల పేర్లను ఏ విభాగంలోనూ పరిగణనలోకి తీసుకోలేదు. కాగా కిషన్ వ్యక్తిగత కారణాలతో గతేడాది డిసెంబర్‌లో దక్షిణాఫ్రికా పర్యటన నుంచి తప్పుకున్నాడు. అయితే ఆ తర్వాత రంజీ ట్రోఫీ ఆడకుండా ఇంటికే పరిమితమయ్యాడు. ఐపీఎల్‌పై దృష్టిసారించినట్టు వార్తలు వచ్చాయి. ఇక శ్రేయాస్ అయ్యర్ ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్ తర్వాత జట్టుకి అందుబాటులోకి రాలేదు. రంజీ క్రికెట్ కూడా ఆడలేదు. అయితే మార్చి 2 నుంచి ప్రారంభమయ్యే రంజీ సెమీఫైనల్‌కు ఆడేందుకు సెలెక్ట్ అయ్యాడు.