Drugs: గుజరాత్ తీరంలో 3,300 కేజీల డ్రగ్స్ పట్టివేత.. ఐదుగురు పాకిస్థానీయుల అరెస్ట్

Navy Seizes 3300 Kg Drugs Off Gujarat Coast

  • ఇంతపెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే తొలిసారి
  • పోర్ బందర్ తీరంలో నేవీ, ఎన్‌సీబీ, గుజరాత్ పోలీసుల సంయుక్త ఆపరేషన్
  • చారిత్రాత్మక విజయమన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా

గుజరాత్ తీరంలో భారతీయ నేవీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో 3,300 కేజీల డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంత భారీస్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం దేశంలోనే ఇది తొలిసారి. పోర్‌బందర్ సమీపంలో మంగళవారం నేవీ అధికారులు ఓ చిన్న పడవను అడ్డుకున్నారు. దాని నుంచి 3,089 కేజీల చరస్, 158 కేజీల మెథాంఫెటామైన్, 25 కేజీల మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్ట్ చేశారు. వీరందరూ పాకిస్థాన్ జాతీయులే. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువను అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, కేజీ చరస్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 7 కోట్ల వరకు పలుకుతుందని అధికారుల అంచనా. 

పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ను పట్టుకోవడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. నేవీ, ఎన్సీబీ, గుజరాత్ పోలీసులు ‘చారిత్రాత్మక విజయం‘ సాధించారని ప్రశంసించారు. దేశాన్ని డ్రగ్స్ రహితంగా తయారుచేయాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. 

పూణె, ఢిల్లీలో ఇటీవల రెండు రోజులపాటు నిర్వహించిన దాడుల్లో రూ. 2,500 కోట్ల విలువైన మెఫెడ్రోన్ (మ్యావ్ మ్యావ్)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పూణెలో 700 కేజీ మెఫెడ్రోన్, ఢిల్లీలో 400 కేజీల నిషేధిత డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. ఇప్పుడు గుజరాత్ తీరంలో అంతకుమించిన మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది.

  • Loading...

More Telugu News