Prathipati Pulla Rao: నా కుమారుడి అరెస్ట్ జగన్ రాజకీయ వికృత చర్యకు పరాకాష్ఠ: ప్రత్తిపాటి

Prathipati Pullarao reacts on his son Sarath arrest

  • జీఎస్టీ ఎగవేత కేసులో ప్రత్తిపాటి తనయుడు శరత్ అరెస్ట్
  • అక్రమ కేసులు పెట్టారన్న ప్రత్తిపాటి పుల్లారావు
  • సీఎం జగన్ ఓటమి భయంతో దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యలు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను జీఎస్టీ ఎగవేత కేసులో నేడు అరెస్ట్ చేయడం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విజయవాడ పోలీసుల అదుపులో ఉన్నారు. పన్ను ఎగవేతకు పాల్పడ్డాడని, మనీలాండరింగ్ అంశాలు కూడా ఉన్నాయంటూ జీఎస్టీ విభాగం శరత్ పై అభియోగాలు మోపింది. జీఎస్టీ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.

దీనిపై ప్రత్తిపాటి పుల్లారావు స్పందించారు. తన కుమారుడిపై అక్రమ కేసులు బనాయించి, అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఏ కంపెనీలోనూ డైరెక్టర్ గా లేడని, కనీసం షేర్ హోల్డర్ కూడా కాదని స్పష్టం చేశారు. ఏ కంపెనీతో లావాదేవీలు లేని తన కుమారుడికి జీఎస్టీ ఎగవేతతో సంబంధం ఏంటని ప్రత్తిపాటి ప్రశ్నించారు. 

ఎన్నికల వేళ అక్కసుతో తమపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదని, న్యాయపరంగా ఎదుర్కొంటామని చెప్పారు. ఓటమి భయంతో సీఎం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. చిలకలూరిపేటలో తనపై పోటీకి వైసీపీకి దీటైన అభ్యర్థి దొరకడంలేదని, అందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. 

చిలకలూరిపేటలో ఎన్నికలకు ముందే తన గెలుపు ఖాయమైందని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో మంత్రి విడదల రజని వైఫల్యాలే వైసీపీ ఓటమికి బాటలు పరిచాయని అన్నారు.

"జగన్ మోహన్ రెడ్డి రాజకీయ వికృత చర్యకు పరాకాష్ఠ ఈ కేసు. ఆ కంపెనీతో ఎటువంటి సంబంధం లేకపోయినా మా అబ్బాయి శరత్ బాబుని అక్రమంగా ఈ కేసులో అరెస్టు చేశారు. నారా చంద్రబాబు గారు నాకు సీటు కన్ఫర్మేషన్ చేయగానే కొన్ని గంటలలోనే ఈ కేసు రిజిస్టర్ అయింది అంటే అర్థమవుతుంది రాజకీయ ప్రేరేపిత కేసు అని. కుటుంబ సభ్యులపై కేసులు పెట్టి మా మానసిక ధైర్యాన్ని నీవు దెబ్బతీయాలనుకుంటే అది జరగని పని జగన్మోహన్ రెడ్డీ... గుర్తుపెట్టుకో... నీ ఉడత ఊపులకి ఇక్కడ భయపడేది ఎవరూ లేరు. నాలుగు సంవత్సరాల నుంచి నువ్వు సాగించిన వేధింపులు ఇంతకన్నా ఎక్కువ ఉన్నాయి. నిన్ను ప్రజా క్షేత్రం నుంచి తరిమి వేసే రోజులు దగ్గర పడ్డాయి అందుకే ఇటువంటి చేష్టలకు నీవు పూనుకుంటున్నావు" అంటూ  ప్రత్తిపాటి ధ్వజమెత్తారు.

  • Loading...

More Telugu News