KS Jawahar: వైసీపీ నేతలు అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవిస్తే మంచిది: కేఎస్ జవహర్
- జెండా సభతో వైసీపీ నేతలకు నిద్ర కరవైందన్న జవహర్
- భవిష్యత్ లో వారికి ఎవరూ నమస్కారం పెట్టే పరిస్థితి ఉండదని వెల్లడి
- జగన్ రెడ్డి పేదల బలహీనతను సొమ్ము చేసుకున్నాడని ఆగ్రహం
తెలుగుదేశం-జనసేన పార్టీలు నిన్న తాడేపల్లిగూడెంలో నిర్వహించిన ‘జెండా’ సభతో ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలకు నిద్ర కరవైందని టీడీపీ సీనియర్ నేత కేఎస్ జవహర్ అన్నారు. భవిష్యత్ లో మీకు ఎవరూ నమస్కారం పెట్టే పరిస్థితి కూడా ఉండదు కాబట్టి వైసీపీ నేతలు అనుభవించాల్సినవన్నీ ఇప్పుడే అనుభవిస్తే మంచిది అని ఎద్దేవా చేశారు.
ఐదేళ్ల తన దోపిడీ పాలనలో జగన్ రెడ్డి పేదల బలహీనతను కూడా సొమ్ము చేసుకున్నాడని ధ్వజమెత్తారు. 25 లక్షల ఇళ్లు నిర్మిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి పేదలకు ఉచితంగా ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదనేది అక్షర సత్యమని అన్నారు. గతంలో చంద్రబాబు నిర్మించిన ఇళ్లను కూడా పాడుపెట్టాడని, చివరకు ఇళ్ల నిర్మాణం పేరుతో పేదల్ని అప్పుల పాలుచేశాడని మండిపడ్డారు.
“అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలపై పైసా భారం పడకుండా ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు నిర్మించి ఇస్తానన్న జగన్ రెడ్డి, చివరకు నివాసానికి పనికిరాని సెంటు పట్టాలు వారికిచ్చి, ఆ స్థలాల్లో ఇళ్లు కట్టుకోకుంటే వాటిని వెనక్కు తీసుకుంటామని పేదల్ని బెదిరించాడు. దాంతో చేసేది లేక వారు అప్పులు చేసి మరీ ఇళ్ల నిర్మాణం చేపట్టాల్సి వచ్చింది" అని జవహర్ వివరించారు.
టీడీపీ ప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే, జగన్ రెడ్డి ట్రాక్టర్ రూ.10 వేలకు అమ్మాడని ఆరోపించారు. సిమెంట్, ఇనుము ధరలు పెంచి సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసేలా పేదల్ని భయపెట్టి... చివరకు ఒక్కో కుటుంబంపై రూ.5 లక్షల అప్పు వేశాడని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.1.80 లక్షలు తప్ప, జగన్ సర్కార్ ఇళ్ల నిర్మాణానికి పేదలకు ఒక్క రూపాయి ఇవ్వలేదని తెలిపారు.. దాంతో ఇంటి నిర్మాణం తల పెట్టిన ప్రతి పేద కుటుంబంపై దాదాపు రూ.5 లక్షల అప్పుభారం పడిందని చెప్పారు.
"పేదలకు నిజంగా ఇళ్లు కట్టించే ఆలోచనే జగన్ రెడ్డికి ఉంటే ఈ విధంగా తన కమీషన్ల కోసం సిమెంట్, ఇనుము ధరలు పెంచుతాడా? కమీషన్ల కోసం తన భారతి సిమెంట్స్ సహా సిమెంట్ కంపెనీలతో కుమ్మక్కు అవుతాడా? డ్వాక్రా సంఘాల్లోని ప్రతి మహిళ పేరుతో రుణాలు తీసుకొని, తద్వారా వచ్చే సొమ్ముతో ఇళ్లు నిర్మించాలని చూస్తున్న జగన్ రెడ్డి కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు.